రాష్ట్రంలో బీసీ వ్యతిరేక పాలన సాగుతోందని, జగన్ రెడ్డి 3 ఏళ్ల పాలనలో బీసీలకు జరిగిన అన్యాయం, ద్రోహం గత 30 ఏళ్లలో ఎన్నడూ జరగలేదని, బీసీలంతా ఐక్యంగా జగన్ రెడ్డి అరాచక పాలనను తరిమికొట్టాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మహాత్మజ్యోతిరావు పూలే జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… బలహీన వర్గాల కుటుంబంలో పుట్టిన సామాన్యుడైన పూలే సంఘంలోని రుగ్మతల పోగొట్టేందుకు కృషి చేసిన వ్యక్తిగా జ్యోతిరావు పూలే మన బీసీ కావడం గర్వకారణమన్నారు.
పూలే ఆశయాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక టీడీపీ అని, ఎన్టీఆర్ టీడీపీ పెట్టకముందు బలహీన వర్గాలు కేవలం ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే ఉండేవారన్నారు. దేశంలోనే ఎక్కడా లేని పథకాలు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు అమలు చేశారన్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి బలహీన వర్గాలంటే కోపమన్నారు. నాడు వైఎస్ఆర్ నేడు జగన్ రెడ్డి బలహీన వర్గాలను ఉక్కుపాదంతో అణచివేశారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికల ముందు బీసీ ఫెడరేషన్లు పెట్టి ఒక్క పైసా ఇవ్వకుండా మోసం చేశారన్నారు.
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఫెడరేషన్లను కార్పొరేషన్లు మార్చారన్నారు. మూడు ఏళ్ల పాలనలలో బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో శ్వేతప్రతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి వేదిక నిర్వహిస్తే మీరేం చేశారో, మేమేం చేశామో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. నాలుక గీసుకునే పదవులు ఎందుకని ప్రశ్నించారు. ఏపీని మూడు ముక్కలు చేసి విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి దారాదత్తం చేశారని మండిపడ్డారు.