టీడీపీపై పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. మీడియాతో శనివారం పార్థసారధి మాట్లాడారు. అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందకూడదని టీడీపీ నాయకులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. జూన్ నెలలో వర్షాలు ప్రారంభమవడం వల్ల గతంలో కెనాల్ పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. నీరు, చెట్టు కింద కాలువ పనులను టీడీపీ చేయలేకపోయిందని, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక మే నెలలోనే రాష్ట్రంలో ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి, తక్షణమే కమిటీ వేసినట్లు గుర్తుచేశారు.
తర్వాత నుండి చిన్న కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదని, అందుకే ఎక్కువ మిషనరీ ఉన్న ఒకే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించామని వివరించారు. కాంట్రాక్టర్ శ్రీనివాస్ తన బినామీగా తప్పడు ప్రచారం చేస్తున్నారని మండిడ్డారు. శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ గతంలో దేవినేని ఉమామహేశ్వరరావు జలవనరుల శాఖాకు మంత్రిగా ఉన్నప్పుడు పనులు చేశారని గుర్తు చేశారు. కృష్ణా పరివాహక కెనాల్ మరమ్మతుల పనులపై టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
యనమలకుదురు-కంకిపాడు కెనాల్ ద్వారా 2 లక్షలకు పై చిలుకు ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. కెనాల్ అభివృద్ధి పనులపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదన్నారు. అయినా కాలువ పనులపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. నీరు, చెట్టు పేరుతో కాంట్రాక్టులు పిలిచి అవినీతి చేయడానికి అనువైన పనులనే చేపట్టారని ఆరోపించారు.