పల్నాడు జిల్లాలో మరో రాజకీయ హత్య చోటు చేసుకుంది. మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం, జంగమహేశ్వరపాడుకు చెందిన కంచర్ల జల్లయ్య అనే టీడీపీ కార్యకర్తను వైసీపీ నేతలు దారి కాచి హత్య చేశారు. దీంతో పల్నాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక జల్లయ్య గ్రామాన్ని వదిలి గురజాలలో నివసిస్తున్నారు. అయితే ఓ శుభకార్యాయం పనిపై బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకుని వస్తుండగా వైసీపీ నేతలు 15 మంది జల్లయ్యతో పాటు మరో ఇద్దరిపైనా దాడి చేశారు. ఈ దాడిలో జల్లయ్య మృతి చెందగా మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై లోకేష్, చంద్రబాబు, టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.
వైసిపి ప్రభుత్వ మద్దతుతోనే పల్నాడులో టిడిపి కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గంలో పార్టీ కార్యకర్త కంచర్ల జల్లయ్యను దారుణంగా హతమార్చిన ఘటనను చంద్రబాబు ఖండించారు. వైసిపి నాయకత్వ ప్రోత్సాహంతో పల్నాడు రాజకీయ హత్యలకు కేంద్రంగా మారుతోందన మండిపడ్డారు. రాజకీయ వేధింపులకు బయపడి బయట ప్రాంతాలకు వెళ్లి బతుకుతున్న జల్లయ్య శుభకార్యం నిమిత్తం సొంత గ్రామానికి వచ్చిన సమయంలో హత్య చెయ్యడం దారుణం అని చంద్రబాబు అన్నారు.
ఫ్యాక్షన్ నేపథ్యంతోపాటు నేర క్రూర మనస్తత్వం వున్న జగన్‌రెడ్డికి ఒక్క చాన్స్ పేరుతో ముఖ్యమంత్రి గద్దెనెక్కిస్తే ఆంధ్రప్రదేశ్ ని అరాచకప్రదేశ్‌గా మార్చేశాడని, పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడులో టీడీపీ వర్గీయులపై వైసీపీ దాడి రాక్షసత్వానికి పరాకాష్టకు నిదర్శనం అని లోకేష్ అన్నారు. వేట కొడవళ్లతో మా టీడీపీ నేత కంచర్ల జల్లయ్యని చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.