Site icon 123Nellore

వేధించే వాళ్లను వదిలి మాకు నోటీసులా.? బోండా ఉమ

అత్యాచార ఘటనపై న్యాయం కోరితే మాకు నోటీసులు పంపుతారా? అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు.  కూర్చున్న కూర్చీ విలువ ఏంటో మహిళా ఛైర్‍పర్సన్‍కు తెలుసా? అని ప్రశ్నించారు. రాజ్యాంగ సంస్థను స్వార్థ ప్రయోజనాల కోసం వాడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతిని పరామర్శిస్తే చంద్రబాబుకి నోటీసులిస్తారా? అంటూ మండిపడ్డారు. నోటీసులిచ్చి బెదిరించాలనుకుంటున్నారా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అక్రమ కేసులకు, నోటీసులకు, మీ బెదిరింపులకు ఎవరూ బెదరబోమని చెప్పారు.

వాసిరెడ్డి పద్మకు పదవి ఇచ్చినందుకు తాడేపల్లి ఆదేశాలు పాటిస్తున్నారని విమర్శించారు. నోటీసులో రాసిన తేదీల్లో తప్పులు ఉన్నాయని, స్పృహలో ఉండే నోటీసులు తయారు చేశారా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మహిళల రక్షణ వదిలేసి తాడేపల్లి విధేయత చాటుకోవడమే పనా? అని విమర్శించారు. ఘటన జరిగిన 3 రోజులైనా స్పందించేందుకు ప్రభుత్వానికి తీరిక లేదన్నారు. చంద్రబాబు వస్తున్నారని తెలిసే ప్రభుత్వం నిద్ర లేచిందని, బాధితురాలికి న్యాయం చేద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.

రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని, తూతూ మంత్రంగా ఇద్దరు పోలీసులపై చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఆడబిడ్డ శీలానికి వెల కట్టి చేతులు దులుపుకుంటున్నారని, వాసిరెడ్డి పద్మపై జాతీయ మహిళా కమిషన్‍కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. మహిళా వాలంటీర్లను వేధిస్తున్న వైసీపీ నేతలకు సమన్లు లేవు కానీ.. మాకు సమన్లు ఇస్తారా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికొదిలేశారని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు, నిందితులను కఠినంగా శిక్షించేంత వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

Exit mobile version