Site icon 123Nellore

అబద్ధాలను ప్రచారం చేయడంలో వాళ్లకు ఎవరూ సాటిరారు : మంత్రి కన్నబాబు

టీడీపీ నేతల ఊహకు కూడా అందని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వ్యవసాయమంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో టీడీపీకి ఎవరూ సాటిరారని విమర్శించారు. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. టీడీపీ హయాంలో ఆర్థిక రంగాన్ని నిర్వీర్యం చేశారని, వారు చేసిన అప్పులకు తాము వడ్డీలు చెల్లిస్తున్నామని వివరించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలు, పేదలు, రైతుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి జగన్ ఎంత కమిట్ మెంటుతో ఉన్నారనేదానికి రాష్ట్ర బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ లే తార్కాణమని పేర్కొన్నారు.

రాబోయే కొత్త జిల్లాలతో కలిపి.. ప్రతి జిల్లాలో వైఎస్ఆర్ రైతు భవన్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, గ్రామాల నుంచి రైతులు పట్టణాలకు, నగరాలకు వచ్చినప్పుడు,  వారి సౌకర్యార్థం, విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం, వసతి కోసం వైఎస్ఆర్ రైతు భవన్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. రైతుల కోసం ఆర్బీకేలు ఏర్పాటు చేసి, ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చినా టీడీపీ నేతలకు కడుపు మంట ఎందుకని మండిపడ్డారు. ఎరువుల కోసం ఆర్బీకేల చుట్టూ తిరుగుతున్నారని పసలేని విమర్శలు చేస్తున్నారని, గతంలో మాదిరిగా క్యూ లైన్లలో గంటల తరబడి నిల్చొనే పరిస్థితి రాకూడదనే, ఆర్బీకేలకు వెళ్ళి రైతులు పేరు నమోదు చేసుకుంటే, వారికి  గ్రామాల్లోనే నేరుగా విత్తనాలు, పురుగు మందులను ఆర్బీకేల ద్వారా ఇస్తున్నామని తెలిపారు.

గత రెండేళ్ళు కొవిడ్ వల్ల ఏ పనులూ జరగని పరిస్థితి ఉందని, ఇక నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు తప్పకుండా వేగవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జలయజ్ఞం అనేది మహానేత  వైయస్ఆర్ ప్రారంభించినదని, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి రాజశేఖరరెడ్డి విధానాలకు కొనసాగిస్తూ, అంతకు మించి చేసి చూపిస్తామన్నారు. బడ్జెట్ ప్రసంగాన్ని సైతం అడ్డుకోవడానికి ప్రయత్నించిన దుర్మార్గపు ప్రతిపక్షం రాష్ట్రంలో ఉందన్నారు.

Exit mobile version