సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకి అన్ని భాషలు సమానమేనని ఆయన టీమ్ స్పష్టం చేసింది. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘మేజర్’ మరికొన్నిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం అనంతరం ఓ జాతీయ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్‌పై మహేశ్ బాబు చేసిన కామెంట్స్ అంతటా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఎంట్రీపై స్పందిస్తూ.. బాలీవుడ్ తనని భరించలేదని.. అందుకే తాను అక్కడికి వెళ్లి సమయాన్ని వృథా చేసుకోవాలనుకోవడం లేదని.. టాలీవుడ్‌లో ప్రేక్షకుల అభిమానం పొందడం ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యలు చేసినట్లు ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో మహేశ్ చేసిన వ్యాఖ్యలను బీటౌన్ ప్రేక్షకులు తప్పుబడుతున్నారు. దీనిపై ఓ ప్రెస్‌మీట్‌లో ఆయన వివరణ ఇచ్చారు. మహేశ్ టీమ్ కూడా ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది.
బాలీవుడ్‌పై చేసిన కామెంట్స్ గురించి ఓ విలేకరి ప్రశ్నించగా…మహేశ్ తనదైన శైలీలో సమాధానం ఇచ్చాడు. హిందీలో నటించాలనే ఆసక్తి లేదని మాత్రమే చెప్పానని, తనకు అన్ని భాషలపై గౌరవం ఉందని క్లారిటీ ఇచ్చాడు. ఏ భాషలో కంఫర్ట్ ఉంటే అక్కడే నటించాలని తాను భావిస్తానని, ఎన్నో ఏళ్ల నుంచి తెలుగులోనే సినిమాలు చేయడం వల్ల మిగతా పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్ అంటే సౌకర్యవంతంగా ఉందని చెప్పినట్లు తెలిపారు. ఇక దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లు తెలుస్తోంది.
కాగా, మహేష్ బాబు-కీర్తి సురేష్ జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో సుబ్బరాజు, వెన్నెల కిశోర్, సముద్ర ఖని తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.