Site icon 123Nellore

ఖబడ్దార్ అధికారులారా..? మీ సంగతి తేలుస్తాం : అచ్చెన్నాయుడు

మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మహానాడు తెలుగుజాతి పండుగ అని, ఒంగోలులో మహానాడు నిర్వహణకు అనుమతివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహానాడు ఏర్పాట్లపై పార్టీ నేతలతో మంగళవారం సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బోడి జగన్ అనుమతిచ్చేదేంటీ?.. మహానాడు నిర్వహించేందుకు స్థలం ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారని తెలిపారు. మహానాడుకు ప్రభుత్వం వాహనాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకునేందుకు చలానా కడితే అడ్డుచెబుతున్నారని మండిపడ్డారు.

ప్రైవేట్ వాహన యజమానులను ఆర్టీవోలు బెదిరిస్తున్నారని విమర్శించారు. మహానాడు సభను నిర్వహించేందుకు ఇటీవల స్టేడియానికి అననుమతి ఇచ్చి రద్దు చేశారని, ఇప్పుడు మహనాడుకు వాహనలు ఇస్తే సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరించిన అధికారుల వివరాలు సేకరించాం అని తెలిపారు. ఖబడ్దార్ అధికారులారా..? మీ సంగతి తేలుస్తాం అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. బైకులు, ట్రాక్టర్లు, సొంత వాహనాలతో మహానాడుకు వెళ్తామని, మూడేళ్ల వైసీపీ పాలనపై తిరుగుబాటుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు.

రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించుకునేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని, మహానాడుకు స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మహానాడును విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త  కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీ అరాచకాలను కార్యకర్తలు ఎదురొడ్డి పోరాడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహానాడును నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మహానాడు నుండే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభమౌతాయని తెలిపారు. అధికార పార్టీ దుర్మార్గాలను, అరాచకాలపై మహానాడు వేదికగా సమరశంకం పూరిస్తామని పేర్కొన్నారు

Exit mobile version