పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె జిల్లాలోనే నెంబర్ వన్ ఎమ్మెల్యేగా పేరు పొందారు. జిల్లా పార్టీలో చాలా కీలకంగా ఉండేవారు. గతంలో ఆమెను పొగిడి, పనులు చేయించుకున్న నేతలు ఇప్పుడు నేరుగా విమర్శలు చేస్తున్నారంట. ఈమెకు గట్టిగానే పొగబెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా మాజీ..ఎక్కడ..? సొంత పార్టీలో ఎందుకు ఇబ్బంది పడుతోందో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. శ్రీకాకుళం టీడీపీలో మొదటి నుండి రెండు గ్రూపులు ఉన్నాయి. అందులో ఒకటి కింజరాపు కుటుంబం కాగా, రెండవది గుండా అప్పల సూర్యనారాయణ కుటుంటం. అయినా తన చాణక్యంతో రాజకీయాలు నడుపుతూ సుధీర్ఘంగా రాజకీయాలు చేస్తూ వచ్చింది గుండా కుటుంబం.
2014లో 20 వేల ఓట్ల మెజారిటీతో ధర్మాన ప్రసాదరావును ఓడించారు. 2019లో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుండి పార్టీలో వర్గపోరు నడుస్తోంది. మహానాడు సన్నాహక సమావేశంలో యువతకు పట్టం కట్టాలని పలువురు నేతలు స్వరం పెంచారు. దీంతో గుండా కుటుంబం కలవరపడుతోంది. గుండా కుటుంబానికి టికెట్ రాకుండా చేసేందుకు ఇప్పటి నుండే పావులుకదుపుతున్నట్లు కింజరాపు కుటుంబం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
యువతకే టికెట్ అని రామ్మోహన్ నాయుడు వర్గం సోషల్ మీడియాలో ప్రచారం. అచ్చెన్నాయుడు వర్గం మనుషులు గుండా కుటుంబానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టారంట. దీంతో కింజరాపు పేరు వింటేనే గుండా వర్గీయులు మండిపోతున్నారని తెలుస్తోంది. ధర్మాన వర్గంతో కలిసిపోయి తమ ఓటమికి కింజారపు కుటుంటం సహకరిస్తోందన్న భావన గుండా కుటుంబంలో ఉంది. అధ్యక్షుడి జిల్లా కావడంతో విభేధాలు బయటపడటం లేదు. అయితే దీనిపై అధిష్టానం సత్వర నిర్ణయం తీసుకుని సమస్య పరిష్కారం చేయకుంటే పార్టీ నష్టపోతుందని తమ్ముళ్లు హైరానా పడుతున్నారు.