లవర్ బాయ్ ఇమేజ్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో సిద్దార్థ్. టాలీవుడ్‌లో అనేక హిట్ సినిమాల్లో నటించిన సిద్ధూ.. ఆ తరువాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్‌కి వెళ్లిపోయారు. అక్కడే ఒకట్రెండు సినిమాలు చేస్తూ గడిపారు. చాలాకాలం తర్వాత మహాసముద్రం సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు. తాజాగా ఎస్కేప్ లైవ్ అనే హిందీవెబ్‌సిరీస్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సిరీస్ డిస్నీ+హాట్ స్టార్ లో మే 20 నుంచి ప్రీమియర్ కానుంది.
ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవల విజుదలై ప్రేక్షకులను ఆకట్టుకోవటంతో.. మరింతగా ప్రమోట్ చేస్తుంది టీమ్. ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్ గా సిద్ధార్థ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సిరీస్‌లో తన పాత్ర రెగ్యులర్‌గా ఉండదని.. ఈ పాత్రలో తనను ఎంపిక చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంచి ఆఫర్లు వస్తే మళ్లీ బాలీవుడ్‌కి తిరిగొస్తానని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ రోల్స్ వచ్చేవరకే నటిస్తానని.. లేదంటే యాక్టింగ్ మానేసి వేరే ఉద్యోగం చేసుకుంటానని అన్నారు.
‘‘నటుడిగా నా కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి నేను ఎక్కువగా దక్షిణాది చిత్రాల్లోనే నటించాను. అందువల్ల చాలామంది నేను దిల్లీ అబ్బాయిననే విషయాన్ని మర్చిపోయారు. హిందీ చాలా బాగా మాట్లాడతాను. ఆసక్తికరమైన పాత్రలు వచ్చినప్పుడల్లా హిందీ చిత్రాల్లో నటిస్తుండటం ఒక అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా సిద్ధార్థ్ కుమార్ ‘ఎస్కేప్ లైవ్’ కథ చెప్పారు. కథ నాకు బాగా నచ్చింది. వెంటనే ఓకే చేశాను. ఆసక్తికరమైన పాత్రల్లో నటించే అవకాశం వచ్చినంతవరకూ నేను సినిమాల్లో నటిస్తాను. అలాంటి అవకాశాలు రానప్పుడు తప్పకుండా నటనకు స్వస్తి పలికి వేరే ఉద్యోగం వెతుక్కుంటాను’’ అని సిద్ధార్థ్ వివరించారు.