Arikelu: అరికెలలో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటి కారణంగా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని పూర్వకాలంలో మన పెద్దలు ఎక్కువగా తీసుకునేవారు. అందుకే వారు వయసు పైబడిన కూడా ఆరోగ్యంగా ఉండేవారు. చిరుధాన్యాలలో ఒకటిగా ఉన్న అరికెలు తీపి, వగరు, చేదు రుచులను కలిగి ఉంటాయి.
అరికెలలో ఐరన్, ఫైబర్, క్యాల్షియం, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అరికెలను తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరిగి అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన పోషకాలు ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధులు దరిచేరకుండా కాపాడుతాయి.
అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరిచి మధుమేహం సమస్యను తగ్గిస్తాయి. ఉదర సంబంధిత సమస్యలను తగ్గించి ఉదర భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి. కీళ్ల నొప్పులు, వాతం నొప్పులను తగ్గిస్తాయి.
ఎముకల దృఢత్వానికి సహాయపడతాయి. వీటిని తీసుకుంటే నిద్రలేమి సమస్యలు తగ్గి నిద్ర బాగా పడుతుంది. మహిళలు అరికెలను ఆహారంగా తీసుకుంటే నెలసరి సమస్యలు తగ్గుతాయి. రక్తాన్ని శుద్ధి చేసి డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు తొందరగా తగ్గడానికి సహాయపడుతాయి.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచి గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. నరాల బలహీనత సమస్యలతో బాధపడేవారు అరికెలను తీసుకోవడం మంచిది. వీటిని తీసుకుంటే బరువు కూడా తగ్గుతారు. అరికెలతో అన్నం, ఉప్మా ఇలా ఏదో ఒక రూపంలో వండుకొని శరీరానికి అందిస్తే ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు.