ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో వైసీపీ చేయాల్సిన పనిని తాను చేస్తున్నానని బీజేపీనే రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీలో నిధుల కోసం చట్టసభల్లో తానే ప్రస్తావించానన్నారు. వైసీపీ ఎంపీలు చేయాల్సిన పని తాను చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారని, వైసీపీ కృషి ఎక్కడైనా ఉందా అని ఆ పార్టీ ఎంపీలను ప్రశ్నించారు. బడ్జెట్ లో రాష్ట్ర ప్రస్తావన లేదని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏమీ చేయకుండానే రాష్ట్రానికి ప్రాజెక్టులు, రహదారులు వచ్చాయా? అని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ ను వైసీపీ ఎంపీలు తెచ్చుకోలేదని, సరైన ఆదాయ వనరులు లేని రాష్ట్రానికి హోదా ఇవ్వాలని మాత్రమే తమ ఆలోచనా విధానమన్నారు. ఏపీకి అంతకు మించి ప్యాకేజీ రూపంలో కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. అన్నీ తెలిసి జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకున్నారని, కేంద్ర హోం శాఖ సెక్రటరి అజయ్ కుమార్ భల్లాకి లేఖరాశాన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాస్పద సమస్యలపై చర్చించాలని, సూచనలు చేసే కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంతో తెలంగాణకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
కమిటీలో చేసిన నిర్ణయాలను అమలు చేసేలా చూడాలని, తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తానేదో మాట్లాడి హోదా అంశం తొలగించారనడం ఆశ్చర్యంగా ఉందని, మోదీ, అమిత్ షా నిర్ణయిస్తే తాము మార్చగలమా? అని ప్రశ్నించారు. అజెండాలో పెట్టాల్సిన అంశాలను అధ్యయనం చేయడానికి మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. విభజన చట్టానికి సంబంధం లేని నాలుగు అంశాలను పొరపాటున అజెండాలో పెట్టారని, ఏపీకి మాత్రమే సంబంధించిన అంశాలను మనం మాట్లాడుకుంటే సరిపోతుందని చెప్పారు.