అవసరం కోసం వాడుకుని, అవసరం తీరాక నిలువునా వంచించి వదిలేయడంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి టాప్ ర్యాంకర్ అని ఆర్థికశాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘అధికారంలోకి వచ్చినప్పటి నుండి.. తమ అనైతిక చర్యలకు, అక్రమ అరెస్టులకు గౌతం సవాంగ్ ను అడ్డగోలుగా వాడుకుని.. ఇప్పుడు అవమానకర రీతిలో గెంటేశారు. డీజీపీ స్థాయి వ్యక్తికి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఘోరంగా అవమానించారు.
గతంలో సీఎస్ గా పని చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను అన్నా అని పిలుస్తూనే.. ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసి అవమానించారు. ఇదే విధంగా పీవీ రమేష్, అజేయకల్లాం వంటి వారి పట్ల అవమానకర రీతిలో అధికారాల్లో కోత విధించి పొమ్మనకుండా పొగబెట్టారు. న్యాయమూర్తుల మీద విషం కక్కే పనిని అజేయ కల్లంతో చేయించిన జగన్ రెడ్డి పని అయిపోగానే ఆయనను పక్కన పెట్టారు. అంతా నీవే అన్న ప్రవీణ్ ప్రకాశ్ ను రాష్ట్రం దాటి కనీసం ఎలాంటి ప్రాధాన్యం లేని ఢిల్లీ లోని ఏపీ భవన్ కు తరిమేశారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తోంది. మరోవైపు.. ఆస్తులు తాకట్టు పెట్టి, భూములు అమ్మకానికి పెట్టి భారీగా ఆదాయం సమకూర్చుకుంటోంది. కానీ.. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా అందించలేకపోవడం రాష్ట్రంలో లోపించిన ఆర్ధిక క్రమశిక్షణకు నిదర్శనం. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మోసం చేశారు. రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ప్రకారం రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ విధించాలి. లేకుంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.