పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సినవసరం ఉందని, ప్రజా ఉద్యమం రావాలి.. టీడీపీ నాయకత్వం వహిస్తుందని పేర్కొన్నారు. అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు. రాష్ట్రం కోసం అవసరమైతే త్యాగాలు చేస్తాం.. జైలుకైనా వెళ్తామన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మూడో రోజు కాకినాడలో పాల్లగొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోంది. దిశ చట్టంపై ప్రభుత్వం ప్రచారం తప్ప చేసిందేమీ లేదు. ఆడబిడ్డ తల్లుల పెంపకం సరిగా లేదంటూ మహిళా హోంమంత్రి వ్యాఖ్యలు బాధాకరం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నారు.
ఏపీ భవిష్యత్ ను సీఎం జగన్ అంధకారం చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను అరెస్టు చేస్తే మీ పై వ్యతిరేకత తగ్గుతుందా?. అరాచక ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. ప్రజల కోసం తీవ్ర వాదులతో పోరాడుతున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలి. అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం. ప్రజా ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యలపైనే మా పోరాటం. రాష్ట్ర పరిస్థితి చూసి బాధ, ఆవేదన కలుగుతుంది. నిన్న ముగ్గురు ఆడబిడ్డలపై అత్యాచారం జరిగింది. ఆడబిడ్డలపై అత్యాచారం జరుగుతుంటే మంత్రి.. తల్లుల పెంపకంపై మాట్లాడడం సిగ్గుచేటు.
సజ్జల రాసిన స్టేట్ మెంట్లను హోంమంత్రి చదువుతున్నారు. కరెంట్ బిల్లులు 40 శాతం పెంచారు. కరెంటు రాదు కానీ బిల్లులు మాత్రం బాదుడే బాదుడు. జంగారెడ్డిగూడెం సారా మరణాలు సహజ మరణాలంటూ సీఎం కొట్టిపారేశారు. జగన్ దెబ్బకు కింగ్ ఫిషర్ పారిపోయి.. బూమ్ బూమ్ వచ్చింది. బాబాయి హత్య మాదిరిగా మిమ్మల్ని, నన్ను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరిస్తాడేమో. దేశంలో పెట్రోల్, డీజిల్ ధర ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పదో తరగతి పరీక్షలను నిర్వహించలేని సీఎం 3 రాజధానులు కడతాడట.’’ అని విమర్శించారు.