నూతన సంవత్సరం అనగానే సంబరాల వేడుకగా జరుపుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఆసక్తి చూపుతారు. మన నెల్లూరు నగరీయులు అందుకు మినహాయింపు కాదు. డిసెంబర్ 31 అర్థరాత్రి నుండి సంబరాలకు తెరతీస్తారు. చిన్నాపెద్దా అని భేదాలు లేకుండా ఒకరికొకరు ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలుపుకుంటారు. సంబరాల్లో భాగంగా నోటిని తీపు చేసుకునేందుకు స్వీట్లు, కేకులు పంచుకుంటారు. దీంతో స్వీట్లు, కేకుల వ్యాపారస్తులకు నగరంలో ఒక సంవత్సరంలో జరిగే వ్యాపారం ఈ ఒక్క రోజే జరుగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ డిమాండ్ ను ఆసరా చేసుకుని కొందరు వ్యాపారస్తులు ప్రజల్ని తీవ్రంగా దోచుకుంటున్నారు. గతంలో ఈ సంబరాల్లో భాగంగా కేకులను ఎక్సిబిషన్ లాగా పెట్టిన అనేక వ్యాపారస్తులు అమ్మిన కేకుల్లో భారీగా తూకంలో తేడాలు ఉన్నాయి. ఓ 50 గ్రాములంటే సహజ తప్పిదం అనుకోవచ్చు కానీ 1 కేజీకి సరాసరి 300 గ్రాముల వరకు తేడాలు వచ్చాయి. ఒక కేజీ కేకు అనుకుని అంత రేటు చెల్లిస్తూ నూతన సంవత్సర సంబరాల భాగంలోనే అనేకమంది ప్రజలు మోసపోయారు.
కనుక ఈ దఫా మీరు కొనే కేకుల తూకం సరిగా ఉందో లేదో అనే విషయాన్ని ఖచ్చితంగా పరిశీలించండి. తప్పుడు తూకాలు ఉంటే తూనికల కొలతల శాఖ వారికి ఫిర్యాదు చేయవచ్చు. తూనికల కొలతల శాఖ వారు కూడా ఈ విషయమై విస్తృత స్థాయిలో అన్ని దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి ప్రజలు మోసపోకుండా చూడాలని నగర ప్రజలు కోరుతున్నారు.