ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ వినియోగం సోషల్ మీడియా వెబ్ సైట్ ల పుణ్యమా అని పెరిగిపోయింది. ముఖ్యంగా ఫేస్ బుక్ ఒక విప్లవాత్మక మీడియా సాధనం గా ఎదిగింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల కంటే త్వరితగతిగా ఈ సోషల్ మీడియా ద్వారా అనేకమంది అప్ డేట్స్ పొందుతున్నారు. దీంతో వార్తా కథనాలు ప్రచురించే వివిధ ప్రముఖ మీడియా సంస్థల నుండి అనేక సంస్థలు పుట్ట గొడుగుల్లా వేలాది వెబ్ సైట్స్ సృష్టించి కథనాలను సోషల్ మీడియాలో పొందుపరుస్తున్నారు. ఈ వార్తా కథనాలకు తోడుగా పలువురు తమ టైం లైన్ పై పుకార్లను వ్యాప్తి చేస్తున్నారు. అవి నిజమని వాటిని పలువురు షేర్ల మీద షేర్లు చేస్తూ ఆ ఫేక్ విషయాలను నిజమనుకుని విస్తృత పరుస్తున్నారు. పలు వార్తా వెబ్ సైట్ లు సైతం నిజనిర్ధారణ చేసుకోకుండా త్వరగా వార్తలను ఇవ్వాలనే ఉద్దేశంతో పలు సార్లు ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. అమెరికా ఎన్నికల సందర్భంగా ఫేస్ బుక్ లో ఎన్నికలకు సంబంధించి, అభ్యర్ధులకు సంబంధించి అనేక ఫేక్ వార్తలు దావానంలా వ్యాపించాయి. దీంతో ఆలోచనలో పడ్డ మార్క్ జుకెర్ బర్గ్ బృందం ఈ ఫేక్ కథనాలను అడ్డుకోవాలనే నిర్ణయానికి వచ్చింది . దీంతో కొన్ని పేరెన్నిక గన్న మీడియా సంస్థలతో, సర్వే నిర్వహణ సంస్థలతో ఫేస్ బుక్ ఒప్పందానికి వచ్చింది. ఫేక్ బుక్ లో ఏదైనా వార్తని ఫేక్ వార్త అని ఈ సంస్థలు నిర్ధారిస్తే ఆ వార్తను ప్రాచుర్యం చేయడం ఫేస్ బుక్ ఆపేస్తుంది. ఎవరైనా ఆ వార్తను షేర్ చేయాలని చూస్తే ఇది ఫేక్ వార్తగా నిర్ధారించబడింది అనే నోటిఫికేషన్ ను ఇవ్వనుంది ఫేస్ బుక్. ఫేక్ వార్త తీవ్రత ఎక్కువైతే ఆ వార్తను ఫేస్ బుక్ తొలగిస్తుంది. ఇలా థర్డ్ పార్టీ సంస్థలకే కాకుండా తమ వినియోగదారులకు కూడా ఫేస్ బుక్ ప్రస్తుతం రిపోర్ట్ పోస్ట్ లో ఇస్తున్న మూడు ఆప్షన్ లలో “ఇది ఫేక్ స్టొరీ” అనే ఆప్షన్ ను జత చేయనుంది. ప్రస్తుతం అమెరికాలో అమల్లోకి తీసుకురానున్న ఈ విధానం అతి త్వరలో భారత్ లో కూడా అందుబాటులోకి రానుంది.