Site icon 123Nellore

ప్రధానికి సామాన్యుని ప్రశ్నలు

నల్లధనం అరికట్టటానికి మీరు తీసుకున్న పెద్ద నోట్లు రద్దు నిర్ణయాన్ని మేము సంతోషంగానే స్వాగతించాము. అలాగే ఈ చర్య వలన మేము ఎన్ని రోజులైనా ఇబ్బంది పడతాము కానీ మీరు ఈ 5 పనులు చేయగలరా ? ఇది ప్రతి సామాన్యుడి ప్రశ్న 

1.అవినీతిపరులకి కఠినశిక్ష:

అవినీతి పోయి దేశం బాగుపడుతుంది అనే ప్రజలు నోట్ల మార్పిడి ని స్వాగతించారు.  దేశంలో అత్యంత అవినీతిపరులైన ఐఏఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్ అధికారులని కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి ఇళ్ళకు పంపించడం. దీనితో పాటే దేశంలో అత్యంత అవినీతిపరులు అయిన నాయకుల అక్రమ ఆస్తుల్నిజప్తు చేసి ప్రజలకి పంచడం.

2.పౌరసేవల చట్టం

లంచాల్ని అరికట్టేందుకు పౌరసేవల హక్కు చట్టాన్ని తేవాలి. ప్రభుత్వ సేవలు పొందాలంటే లంచాలు ఇవ్వక తప్పని దుస్థితి నుంచి ప్రజల్ని కాపాడేందుకు, ఈ చట్టం ఉపయోగపడుతుంది. ఏ పని ఎన్ని రోజుల్లో చేయాలో స్పష్టంగా పేర్కొనడం, అన్ని రోజుల్లో చేయకపోతే ఉద్యోగికి ఫైన్ వేయడం, ప్రజలకి నష్టపరిహారం చెల్లించడం లాంటివి ఈ చట్టంలో ఉండాలి. ఈ బిల్లు ఇప్పటికే పార్లమెంట్ లో ఉంది. దాన్ని పాస్ చేయడమే.

3.పన్నుల్ని తగ్గించడం

ఆదాయపుపన్నుని బాగా తగ్గించాలి. చేతనైతే అందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం, పాఠశాల విద్య అందించేదుకు సమూల ప్రక్షాళన చేయాలి. ఇది జరిగేవరకు కనీసం మందుల మీద, పుస్తకాల మీద పన్నులు ఎత్తివేయాలి. మందులు, పుస్తకాల ధరలు తగ్గితే ప్రజలకి పెద్ద రిలీఫ్ వస్తుంది.

4.క్యాష్ లావాదేవీలని తగ్గించడం

అయిదు వేలు మించిన ప్రతి లావాదేవి తప్పనిసరిగా కార్డ్, ఆన్ లైన్ రూపంలో జరిగేలా చట్టాలని సవరించడం. బంగారం లాంటి విలువైన లోహాల అమ్మకాలు తప్పనిసరిగా ఆన్ లైన్ లేదా కార్డ్ రూపంలో జరిగేలా చూడడం.

5. ఆస్తులకి ఆధార్ లింకేజ్

దేశంలో ఉన్న అన్ని ఆస్తులకి ఆధార్ కార్డ్ తో లింక్ చేయడం. ఇది అన్నిటికన్నా కష్టమైన, అత్యవసరమైన పని. దేశంలో ఇళ్ళు, ఇళ్ళస్థలాలు, వ్యవసాయభూములు ఏవి ఎవరి పేరుమీద ఉన్నాయి, వారి ఆధార్ నంబర్ ఏమిటి అన్నీ రికార్డ్ చేయాలి. దీనితో బినామీ ఆస్తులకి చెక్ పడుతుంది.

ఈ విషయాల పై ప్రధాని దృష్టి పెట్టి అమలుపరిస్తే ఉన్నతమైన భారతదేశ నిర్మాణం జరుగుతుందనడంలో సందేహం లేదు.

Exit mobile version