Site icon 123Nellore

ఒరేయ్ నాయనా సముద్రం ఎండిపోతే అప్పుడు పెరుగుద్ది ఉప్పు ధర అంటున్న పలువురు

ఉప్పు కొరత ఏర్పడిందంటూ దావానంలా వ్యాపిస్తున్న పుకార్లు జిల్లాను తాకాయి. బహిరంగ మార్కెట్ లో కేజీ 10 రూపాయల విలువగల ఉప్పు డిమాండ్ వెల్లువలా రావడంతో 40 రూపాయల వరకు అమ్మడం జరిగింది. ఉప్పు అయిపోతుంది, అయిపోతుంది అంటూ కొందరు పనిగట్టుకుని చేసిన ప్రచారం ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టించింది. దీంతో ఉప్పు కొనేందుకు ఎగబడ్డారు. సముద్రం నుండి లభించే ఉప్పు విషయంలో ప్రజలు ఆందోళన చెంది దుకాణాల వైపు ఎగబడ్డారంటే ఈ పుకార్ల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ పుకార్లపై స్పందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ స్పందిస్తూ ఉప్పు నిల్వలు తగ్గాయని వస్తున్న వార్తలు అబద్ధమని పేర్కొన్నారు. జిల్లాలో కాని, రాష్ట్రంలో కాని ఎక్కడా ఉప్పు కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.కాగా పుకార్ల నేపథ్యంలో కొంతమంది దుకాణుదారులు ఉప్పు ధరలను అమాంతం పెంచేశారు. వీరి పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయినా సముద్రం నుండి ఉత్పత్తి అయ్యే ఉప్పు కొరతేంటిరా బాబూ అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Exit mobile version