ఆరు వేల కోట్లు! అక్షరాలా ఆరు వేల కోట్ల రూపాయలు!! నల్లధనం కట్టడికి ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో.. ఓ గుజరాతీ నగల వ్యాపారి ప్రభుత్వానికి ఇంత సొమ్ము స్వాధీనం చేసినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఆ మొత్తం రూ.500, 1000 నోట్ల రూపంలోనే ఉందని తెలుస్తోంది. ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా కార్లు.. ఫ్లాట్లు కొనిస్తూ వార్తల్లో నిలుస్తున్న లాల్జీభాయ్ పటేలే ఆ వ్యాపారి అని సమాచారం. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటనకు వచ్చినప్పుడు మోదీ ధరించిన రూ.10 లక్షల సూట్‌ను వేలంలో రూ.4.3 కోట్లకు కొన్న కుబేరుడు ఈయనే. భారతదేశంలోని అత్యంత సంపన్నులైన నగలు, రత్నాల వ్యాపారుల్లో ఒకడిగా పేరొందిన లాల్జీభాయ్.. బాలికల విద్య కోసం రూ.200 కోట్లు విరాళంగా ఇచ్చి అందరి మెప్పూ పొందారు.
ముందే కట్టి ఉంటే..
మీడియాలో విస్తృతంగా వస్తున్న ఈ కథనాలే నిజమైతే గనక.. లాల్జీభాయ్ ఈ సొమ్ముపై 30 శాతం పన్ను.. రూ.1800 కోట్లు, ఆ పన్నుపై 200 శాతం జరిమానా అంటే మరో రూ.3600 కోట్లు.. అన్నీ కలిపితే రూ.5400 దాకా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆరు వేల కోట్ల సరెండర్ నిజమే అయితేగనక.. ఆయన తన ఆదాయాన్ని ఐటీ లెక్కల్లో చూపి ఉంటే.. 30 శాతం పన్నుతో సరిపోయేదని.. కనీసం.. ప్రభుత్వం అవకాశం ఇచ్చిన ‘ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్)’లో గనక ఈ మొత్తాన్ని చూపి ఉంటే.. 45 శాతం పన్నుతో సరిపోయేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇప్పుడు.. పెనాల్టీతో కలిపి 90 శాతం పన్ను కట్టినట్టవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఈ తరహాలో వేల కోట్లు దాచిన నల్లకుబేరులు ఇంకా చాలమంది ఉన్నట్టు సమాచారం. వారందరూ బయటకు రాకపోతే.. డిసెంబరు 30 తర్వాత వారి పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.