Site icon 123Nellore

అయ్యా మోడీ… మీరు ఓ లక్ష కోట్ల స్కామ్ చేసి ఉండొచ్చుగా

మీరో లక్ష కోట్లో.. పది లక్షల కోట్లో స్కామ్ చేసుకుంటే మాకీ బాధ ఉండేది కాదు. ఎందుకంటే అది మాకు 70 ఏళ్లుగా అలవాటైపోయింది.. స్కాముల వల్ల మా జేబుల్లో డబ్బులు డైరక్ట్ గా పోవు గదా..
భవిష్యత్ తరాలు అంటే మా పిల్లలు, మనవలు, ముని మనవలు ఇబ్బంది పడితే మాత్రం మాకేమిటి.. మేము ఈ రోజుకి సుఖంగా ఉన్నామా లేదా అన్నదే మాకు ముఖ్యం.
అది మానేసి మీరిలా నల్లధనం నిర్మూలన.. అవినీతిని అరికడతాను అంటే ఎలా చెప్పండి? ఇదేమాట ఎన్నికల్లో చెబితే నమ్మి మీకు ఓటేశాం.. కాదనడంలేదు. అయితే మామూలుగా నాయకులు వాగ్దానాలు చేసి మర్చిపోతారు గదా.. మీరూ అలాగే అనుకున్నాం ఆరోజు. కానీ మీరు మా నమ్మకాన్ని వమ్ము చేసి పారేసి.. నిజంగానే అవినీతిపై యుద్ధం చేస్తానంటే ఎలా చెప్పండి? మీకంటే పెళ్ళాం బిడ్డలు లేరు.. కుటుంబం, సంపాదన అనే లంపటాలు లేవు .. మరి మా మాట..!! ఏం దేశంలో జనమంతా సన్యాసులనుకున్నారా.. లేక మీలా నిబద్ధత గల ఆరెస్సెస్ ప్రచారక్ లు అని భావిస్తున్నారా?
దేశం అభివృద్ధి చెందితే మాకేమిటి.. చెందకుంటే మాకేమిటి. అందుకోసం మమ్మల్ని 50 రోజులు ఇబ్బంది పెడతారా.. మీ పాలన మాకేం నచ్చలేదు.
అవినీతి లేకుండా చేసేస్తే.. మాకు ఈజీ మనీ ఎలా వస్తుంది? ఎన్నికల్లో ఓటుకి రెండు వేలు ఎవడిస్తాడు.. మీరిస్తారా?
మాకు ఎంత వస్తుంది అనేది మాకు ముఖ్యం కాదు. అవినీతిలో భాగం కావడమే మాకు ప్రధానం. మేము ఏ సరుకు కొన్నా బిల్లు తీసుకోము. అందువల్ల మాకు రూపాయి కలిసొచ్చినా చాలు.. ఆ అక్రమ వ్యాపారి ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడతాడు అదే మాకు సంతోషం. అలాంటి అక్రమ వ్యాపారులు కోట్లు సంపాదించుకుంటే అదే మాకు పరవశం.
స్విస్ బ్యాంకు లో డబ్బంతా తెచ్చి మాకు పంచేస్తాం అని చెప్పారు గదా అప్పట్లో… ముందు విమానంలో వెళ్లి ఆ డబ్బు కంటైనర్ లో తెచ్చి మాకు మనిషికి ఇంతని పంచేసి మాట నిలబెట్టుకోండి. ఆ తర్వాత మీ పక్కన, మీ పార్లమెంట్లో, మీ ఢిల్లీ లో ఉన్న కుబేరులందరి డబ్బులూ లాగేసి అవి కూడా పంచేయండి. ఆ తర్వాత మా దగ్గరికి రండి… అప్పటికి అన్నీ బాగుంటే.. మీరు, మేమూ ఉంటే.. అప్పుడు మా డబ్బులు మీకు లెక్క చెబుతాం. టాక్స్ కట్టాల్సి ఉంటే వాయిదాల్లో కడతాం. నో ప్రాబ్లమ్.
అయ్యా ఈలోగా మీకు మరీ ఖాళీగా ఉంటే.. అంత తాపత్రయంగా ఉంటే.. అవినీతి పై పోరాటం పేరుతొ ఒక నెలరోజులు బందులు, హర్తాళ్లు చేయించండి.. మేము కూడా పాల్గొని మద్దతిస్తాం. షాపులు కట్టించేస్తాం.. ఇంకా అవసరం అయితే ప్రభుత్వ వాహనాలు, బస్సులు, రైళ్లు కాల్చేస్తాం. పోలీసు కాల్పుల వరకూ తీసుకెళ్లి మీకు మంచి పేరు తెస్తాం.
చివరిగా ఒక్క ప్రశ్న.. ఏం దేశంలో మీరొక్కరే తెలివైన వాళ్ళని మీ ఫీలింగా? మాకు తెలియదా దొంగలు ఎవరో? వాళ్ళు మా పక్కనే లేరా? ఏదో అందరం అలా కలిసిమెలిసి బతుకుతున్నాం ఇంతకాలంగా.. “దేశ” ప్రయోజనాల పేరుతొ మా మధ్య విభేదాలు తెస్తారా? మీ తీరు అస్సలు నచ్చడం లేదు మాకు!
అయినా మీ పిచ్చి గానీ.. పాకిస్థాన్ పై దాడి చేసి తీవ్రవాద శిబిరాలు ధ్వంసం చేస్తేనే మేము సంతోషించలేదు.. పైగా మీ మీద, సైన్యం మీద కూడా విమర్శలు చేసాం! మాకు మా సైనికులు చచ్చిపోయినా సంతోషమే గానీ .. మీకు పేరొస్తే ఎలా సహిస్తాం?
Exit mobile version