YSRCP: ప్రస్తుతం పార్లమెంటులో శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం జరిగిన సమావేశాల అనంతరం దిల్లీలోని ఏపీ భవన్లో వైసీపీ ఎంపీలు కేంద్రంపై విరుచుకుపడ్డారు. విభజన హామీలపై కేంద్రం అసలు పట్టనట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు వెంటనే నెరవేర్చాలని.. వైకాపా ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇటీవలే ఏపీలో భారీ వరదలు సంభవించి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే కేంద్రం తక్షణసాయం కింద నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు తెదేబా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వల్లే రాష్ట్రానికి ఈ గతి పట్టిందని ఆరోపించారు.
ఇకనైనా చంద్రబాబు బుద్దితెచ్చుకోవాలని.. రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించే పనలు చేయడం ఆపేయాలని అన్నారు. పేదలకు అందాల్సిన తిండిని వారి నోటికి చెందకుండా చంద్రబాబు అడ్డుబడుతున్నారని మండిపడ్డారు.
మరో రెండేళ్లలో విభజన హామీలు నెరవేర్చేందుకు ఇచ్చిన కాలపరిమితి పర్తి కానున్న నేపథ్యంలో ఎంపీలు ఇలా డిమాండ్ వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అన్ని పార్టీలు ఒకే మాటపై నిలబడాల్సిన అవసరం ఉందని అన్నారు. కానీ, స్వార్థ రాజకీయాలకే ఓటేస్తూ.. తెదెపా, బీజేపీ నాయకులు వ్యవహరిస్తుండటం మంచిదికాదని పేర్కొన్నారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై విమర్శలు గుప్పించడం.. పేదవాడి పొట్టగొట్టడమేనని అన్నారు. అందరికీ సమాన న్యాయం అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. వాటిని వృథా అనేందుకు నోరెలా వచ్చిందని వైసీపీ నాయకులు దుయ్యబట్టారు.