వైసీపీ నుండి నలుగురు రాజ్యసభకు వెళ్లనున్నారు. మంగళవారం నాడు సీఎం జగన్, బొత్స సత్యానారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించిన అనంతంర నలుగురిని ఎంపిక చేశారు. ఏపీ నుండి ఖాళీ అయిన స్థానాల్లో బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి పేర్లను చివరకు ఖరారు చేశారు. వీరిలో ఇద్దరు ఏపీ వారు కాగా, ఇద్దరు తెలంగాణ వారు ఉన్నారు. మొన్నటి వరకు మైహోం రామేశ్వరరావు, అదానీ భార్యకు రాజ్యసభ ఇస్తారని టాక్ వచ్చాయి. అయితే చివరకు నలుగురు పేర్లను ఖరారు చేశారు. వీరిలో ఆర్.కృష్ణయ్య తెలంగాణకు చెందిన వ్యక్తి. యాదవ సామాజికవర్గం, బీసీల్లో మంచి పట్టు ఉండటంతో ఆయన్ను ఎంపిన చేసినట్లు తెలుస్తోంది.
టీడీపీకి దగ్గరా ఉన్న బీసీ వర్గాలను దూరం చేసేందుకు ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక ఎన్నికల అనంతరం వైసీపీలో చేరిన బీదా మస్తాన్ రావు కూడా బీసీ వర్గానికి చెందిన నేత. బీసీ ఓట్లలో టీడీపీకి అధికంగా ఉన్న యాదవ ఓట్లను వైసీపీ వైపునకు తిప్పేందుకు వైసీపీ ఈ ఫార్మూలా వినియోగించింది. రెండు స్థానాలు బీసీలకు కేటాయించడంతో వచ్చే ఎన్నికల్లో బీసీ కార్డును ఎక్కువగా వినియోగించాలన్న ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది.
మిగతా రెండు స్థానాలకు రెడ్డి సామాజికవ ర్గానికి చెందిన వారిని పంపుతున్నారు. విజయసాయిరెడ్డి రెండో సారి రాజ్యసభకు వెళ్లగా, నిరంజన్ రెడ్డి మొదటి సారి వెళ్తున్నారు. నిరంజన్ రెడ్డి కూడా తెలంగాణ వ్యక్తే. పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తూ ఇప్పటి వరకు వచ్చారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో విజయసాయిరెడ్డి సఖ్యతగా ఉండటం ఆయనకు కలిసొచ్చిన అంశం. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయాలంటే విజయసాయిరెడ్డి లాంటి సీనియర్ నాయకులు ఉండటమే బెటర్ అని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.