నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కనున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుధ్దం కొనసాగుతుండగా..తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే కూతురు టీడీపీ నుండి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కూతురు కైవల్యారెడ్డి శనివారం ఒంగోలులో నారా లోకేష్ తో భేటీ అయ్యారు. అయితే ఆమె భర్త కుటుంబం ఇప్పటికే టీడీపీలో కొనసాగుతోంది. బద్వేలు ఇంఛార్జిగా అత్త విజయమ్మ ఉన్నారు. అయితే కైవల్యారెడ్డి మాత్రం ఎప్పుడూ రాజకీయాల్లో కనబడలేదు. అయితే లోకేష్ తో భేటీ అనంతరం ఆమె పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి రేగుతోంది.
అయితే బద్వేలు కాకుండా నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు స్థానం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరులో ఆనం కుటుంబానికి మంచి పేరు, అనుచర వర్గం బాగా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరు నుండి పోటీ చేసి గెలిచి మంత్రి అయిన గౌతమ్ రెడ్డి మరణించిన విషయం తెలిసిందే. దానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. సాంప్రదాయం ప్రకారం టీడీపీ ఈ ఉప ఎన్నికల్లో దూరంగా ఉండనుంది. కైవల్యారెడ్డి మాత్రం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆత్మకూరు నుండి ఇద్దరు నేతలు టికెట్ ఆశిస్తున్నారు.
కైవల్యా అభ్యర్థిగా ఉంటే ఆనం సపోర్టుతో పాటు, ఆర్థికంగానూ మంచి బలం ఉండటంతో పాగా వేయవచ్చన్న ఆలోనలో టీడీపీలో ఉంది. రాకను కూడా టీడీపీ నేతలు ఆహ్వానిస్తున్నారు. పార్టీలోకి ఎవరు వచ్చిన తీసుకుంటామని సోమిరెడ్డి స్పష్టం చేశారు. పరిస్థితులను అనుగుణంగా చూసుకుని ఆనం రామనారాయణరెడ్డి కూడా టీడీపీలో చేరతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కూతురు రాజకీయ ఎంట్రీపై ఆనం రామనారాయణరెడ్డి ఇంకా స్పందించలేదు. దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.