Site icon 123Nellore

ఎస్సీ వర్గీకరణపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం – మందకృష్ణ మాదిగ

మాదిగలకు అన్యాయం జరిగిందని తొలుత ఎన్టీఆర్ గుర్తిస్తే.. అందుకు కొనసాగింపుగా చంద్రబాబు వ్యవహరించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గుర్తుచేశారు. అయితే.. ఎస్సీ వర్గీకరణ పట్ల వైసీపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు వల్లే వర్గీకరణ ఫలాలు మాదిగలకు దక్కాయని గుర్తు చేశారు. విజయవాడలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యను మందకృష్ణ మాదిగ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉందన్న ఆయన.. చంద్రబాబు దీనిపై చొరవ తీసుకోవాలని కోరారు.

మహానాడులో ఎస్సీ వర్గీకరణ పరిష్కారానికి టీడీపీ తీర్మానం చేసేందుకు చొరవ చూపాలని వర్ల రామయ్యను కోరారు. ఎన్నికల్లో సీట్లకు సంబంధించి మాల-మాదిగ, రెళ్లి ప్రజలకు 50-50 నిష్పత్తిలో సీట్లు కేటాయించాలని విన్నవించారు. అనంతరం వర్ల రామయ్య మాట్లాడుతూ..ఎస్సీలందరికీ సమాన రాయితీ ఫలాలు దక్కేలా మందకృష్ణ కృషి చేస్తున్నారని ప్రశంసించారు.  మందకృష్ణ లెవనెత్తే అంశాలన్నీ టీడీపీ ఆలోచనల్లో ఉన్నవేనని స్పష్టం చేశారు.

మూడేళ్లుగా దళితుల అభివృద్ధి పూర్తిగా మందగించిందని ఆరోపించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తూ ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లను తొలగించి దళిత విద్యార్థులకు తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విదేశీ విద్యను సైతం రద్దు చేసి పేద విద్యార్థుల ఉసురు తీసుకుంటున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీలంతా టీడీపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. టీడీపీతోనే ఎస్సీ, ఎస్టీల అబివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.

Exit mobile version