నాడు మద్యపాన నిషేదం చేస్తానని మహిళల ఓట్లు దండుకున్న జగన్ రెడ్డి నేడు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యపాన నిషేదం చేయబోమంటూ చెప్పి లిక్కర్ బాండ్లు తాకట్టు పెట్టి రూ. 8 వేల కోట్లు అప్పులు తెచ్చారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్ డీసీ) ద్వారా దొడ్డిదారిన ఇప్పటికే మద్యంపై వచ్చే 15 ఏళ్ల ఆదాయాన్ని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రూ. 25 వేల కోట్లు అప్పులు తెచ్చిన జగన్ రెడ్డి ఇప్పుడు మరో రూ. 8 వేల కోట్లు అప్పులు తెచ్చారు. ఓ వైపు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ. 33 వేల కోట్లు అప్పులు తెచ్చారు.
మరో వైపు ఈ ఏడాది మద్యంపై రూ. 30 వేల ఆదాయాన్ని టార్గెట్ గా పెట్టారు. అంటే పేదల రక్తం పిండి రూ. 66 వేల కోట్లు రాబడుతున్నారు. మధ్యపాన నిషేదం అనే మాటే ఉండదని, పాక్షికంగా కూడా మద్య నిషేధం చేయమని.. అలా చేస్తే.. లిక్కర్ బాండ్లు మూడు నెలల్లో లిక్విడేట్ అయినట్లుగా భావించి చెల్లింపులు చేయాల్సి ఉంటుందనే నిబంధనకు అంగీకరించి ప్రభుత్వం హామీ పత్రం ఇచ్చి మరీ రూ. 8 వేల కోట్లు అప్పు తీసుకున్నారు. జగన్ రెడ్డి జలగలా మారి పేదల రక్తం పీల్చుతూ నాసిరకం జేబ్రాండ్ మద్యం విక్రయించి మహిళల తాళిబొట్లు తెంచుతున్నారు.
9.5 శాతం వడ్డీతో అప్పులు తేవాల్సిన అవసరం ఏంటి? ఆ భారం పేదల ప్రజలపై మోపి వారి రక్తం తాగుతారా? మద్యం అమ్మకాలు, ఆదాయాన్ని ప్రతి ఏడాది పెంచుకుంటూ పోతున్న జగన్ రెడ్డి మద్య అమ్మకాలు తగ్గాయని సాక్షిలో సిగ్గులేకుండా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. మద్యం అమ్మకాలు పెరిగినా వాటిని అధికారికంగా లెక్కల్లో చూపకుండా..మరో వైపు డిజిటల్ లావాదేవీలు నిర్వహించకుండా దొంగ లెక్కలు రాస్తూ ప్రజలను మోసం చేస్తూ వేల కోట్లు దిగమింగుతున్నారు’’ అని ఆరోపించారు.