Site icon 123Nellore

ఆస్కార్‌ అకాడమీకి స్మిత్ రాజీనామా.. తప్పని చర్యలు..!

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తొందరపాటు చర్యతో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అవార్డుల ప్రదానోత్సవ వేదికపై వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమెడియన్ క్రిస్ రాక్ పై విల్ స్మిత్ చేయి చేసుకున్న విషయం విధితమే. విల్ స్మిత్ ప్రవర్తన పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన తరువాత అదే వేదికపై ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్న విల్ స్మిత్ .. క్రిస్ రాక్‌కు క్షమాపణలు చెప్పారు. మరుసటి రోజు ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించిన విల్ స్మిత్.. తన భార్యపై జోకులు వేయడంతో భరించలేకనే అలా ప్రవర్తించానని వెల్లడించారు.

తాజాగా ఆయన ఆస్కార్ అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రతిష్ఠాత్మక వేదికపై వ్యాఖ్యాత క్రిస్‌రాక్‌ను తాను చెంపదెబ్బ కొట్టడం క్షమించరానిదంటూ వ్యాఖ్యానించారు. ‘94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో నా ప్రవర్తన క్షమించరానిది, బాధాకరమైంది. అందరినీ షాక్‌కు గురిచేసింది. క్రిస్‌, అతని కుటుంబ సభ్యులు, నా సన్నిహితులతో సహా నా వల్ల చాలా మంది బాధకు గురయ్యారు. నేను అకాడమీ నమ్మకాన్ని వమ్ము చేశాను. ఈ వేదికపై వేడుక చేసుకునే అవకాశాన్ని కోల్పోయాను. నేను చాలా ఆవేదనలో ఉన్నాను. ఈ సమయంలో అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. తదుపరి పరిణామాలను అంగీకరిస్తాను’ అంటూ స్మిత్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఇక స్మిత్‌ పంపిన రాజీనామాను అకాడమీ ఆమోదించటం గమనార్హం. ఆయనపై క్షమశిక్షణా చర్యలు కొనసాగిస్తామంటూ వెల్లడించారు.

గత ఆదివారం జరిగిన 94వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవా కార్యక్రమంలో ప్రముఖ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈ సందర్భంగా ఓ కామెడీ ట్రాక్‌ను చెబుతూ అందులో విల్‌ స్మిత్‌ భార్య జాడా పింకెట్‌పై కామెంట్‌ చేశారు. అలోపేసియా అనే అనారోగ్య సమస్య కారణంగా జాడా పూర్తిగా గుండుతో కన్పించడంతో.. క్రిస్‌ రాక్‌ ఆమెను జీ.ఐ.జేన్ చిత్రంలో డెమి మూర్ పోషించిన పాత్రతో పోల్చాడు. అయితే అతడి వ్యాఖ్యలను స్మిత్‌ తొలుత సరదాగా తీసుకున్నట్లు కనిపించినా.. ఆ తర్వాత నేరుగా వేదికపై వెళ్లి క్రిస్‌ను చెంపదెబ్బ కొట్టాడు. అప్పటి నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Exit mobile version