వైసీపీ పాలనలో కాపులకు జరిగిన న్యాయం కంటే జరిగిన అన్యాయమే ఎక్కువని, జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కాపులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కాపులకు పెద్దపీట వేస్తే జగన్ రెడ్డి కత్తిపీట వేశారని ఆరోపించారు. ‘‘టీడీపీ హయాంలో కాపు విద్యార్థులకు విదేశీ విద్యకోసం ఏటా రూ.1,500 కోట్ల నిధులను ఖర్చు చేశాం. కానీ జగన్ రెడ్డి విదేశాలకు వెళ్లే కాపు విద్యార్థులకు స్కాలర్ షిప్స్ రూ.10 లక్షల నుంచి రూ.5 లక్షలకు తగ్గించేశారు.
పోటీ పరీక్షలకు సిద్దమయ్యే కాపు విధ్యార్దులకు డిల్లీలోని ఏపీ భవన్ లో వసతి ఏర్పాటు చేస్తే జగన్ రెడ్డి దాన్ని రద్దు చేసి ఏపీ భవన్ ని వైసీపీ భవన్ గా మార్చారు. మరోవైపు.. కాపు కార్పొరేషన్‌ను అలంకార ప్రాయంగా మార్చి కాపు యువతకు ఉపాధి అవకాశాల్లేకుండా అన్యాయం చేశారు. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలె స్ మీద పెట్టిన శ్రద్ద కాపు కార్పోరేషన్ మీద ఎందుకు పెట్టడం లేదు? ఒక్క రోజైనా కాపు కార్పోరేషన్ పై సమీక్ష చేశారా?
కాపు మహిళా నేస్తం పథకం 40 లక్షల మంది మహిళలకు దక్కాల్సింది. కానీ, అది 2.5 లక్షల మందికి మాత్రమే అందింది. అన్నివర్గాలకు ఇచ్చే పెన్షన్లు, అమ్మవడి తదితర పథకాల నిధులను కాపు సంక్షేమంలో చూపించి దగా చేస్తున్నారు. ఉమ్మడి పథకాల్లో నిధులనే బాగాలుగా విడదీసి వెల్ఫేర్ పద్దులో చూపుతున్నారు. దారుణంగా మోసం చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా రాష్ట్ర పథకాల్లో కలిపేశారు.పాత పథకాలకు ముందు వైఎస్సార్ పేరు చేర్చి కొత్త పథకాలుగా నమ్మించి మోసం చేస్తున్నారు’’అని మండిపడ్డారు.