ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమని, తాను ఎప్పుడూ ప్రజల క్షేమం గురించి ఆలోచిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంత మెజారిటీ ఇచ్చిన ప్రజలను చిత్రహింసలు పెడుతున్నారని, ఇతరుల జెండాలు, అజెండాలు తాను మోయనని స్పష్టం చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించి, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం అందించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వ వైఫల్యంపై బీజేపీ పెద్దలకు చెబుతానని, రాజకీయాల్లో పౌరుషాలు ఉండవు.. వ్యూహాలే ఉంటాయని పేర్కొన్నారు.
తనకు పదవులు అక్కర్లేదు.. డబ్బుపై వ్యామోహం లేదు. మేం సింగిల్‍గా రావాలని అడిగేందుకు మీరు ఎవరు? అని ప్రశ్నించారు. ప్రజల కన్నీరు తుడవని ప్రభుత్వం ఎందుకు? రాష్ట్ర విభజన దెబ్బలు ఇంకా తగులుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు రేపు అధికారం ఇచ్చినా బాధ్యతగా స్వీకరిస్తానని స్పష్టం చేశారు. ‘‘నాపై కేసులు లేవు కనుకే ఢిల్లీలో ధైర్యంగా మాట్లాడగలిగా. మీ తరఫున పోరాడేందుకు నన్ను ఆశీర్వదించండి. పొత్తులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి.
డైరెక్ట్ గా చెప్పినప్పుడు చంద్రబాబు ప్రస్తావనపై ఆలోచిద్దాం. ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి. ఏపీ భవిష్యత్ కోసం చాలామంది కలిసి పనిచేయాలి. నా వ్యక్తిగత లాభం కోసం ఎప్పుడు పొత్తులు పెట్టుకోలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే ప్రజలకు నష్టం. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. పార్టీలు చాలా విశాల దృష్టిలో ఆలోచించాలి. పొత్తులపై చర్చలు అవసరం. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి దిజగారిపోతుంది.’’ అని పేర్కొన్నారు.