పాదయాత్రలో సంపూర్ణంగా మద్యపానాన్ని నిషేధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి తన హామీని నిలబెట్టుకుని ఉంటే నేడు రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి అభాగ్యులు చనిపోయేవారు కాదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అని ఆరోపించారు. ప.గో జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి రెండు రోజుల వ్యవధిలోనే 15 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ధన దాహంతో రాష్ట్రంలో మద్యం, నాటు సారా ఏరులై పారిస్తూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నాయన్నారు.
కమీషన్ల కోసం కక్కుర్తితో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నాసిరకం మద్యం విక్రయిస్తూ, మరో వైపు గ్రామాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు నాటు సారా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాసిరకం మద్యం, నాటు సారా తాగి అనేక మంది చనిపోయారని గుర్తు చేశారు. వారి కుటుంబాలు రోడ్డున పడడానికి కారణం జగన్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు.
ఇచ్చిన మాట ప్రకారం పాన నిషేదం అమలు చేసి ఉంటే ఇంత మంది మహిళల మంగళసూత్రాలు తెగేవా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలంటే జగన్ రెడ్డికి లెక్కలేదని, నాటు సారా తాగి మరణించిన వారి కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం, నాటుసారా విక్రయాలని అరికట్టాలని, మద్యపాన నిషేదం ఎప్పుడు అమలు చేస్తారో జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.