ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటిస్తే ప్రయాణీకులను నడిరోడ్డుపై దింపిసి వాహనాలు స్వాధీనం చేసుకొనే పరిస్థితి రాష్ట్రంలో నలకొనడం విచిత్రంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి పర్యటన లాంటివి ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న ట్రావెల్ ఆపరేటర్ల నుంచి వాహనాలు అద్దెకు తీసుకోవడం గురించి విన్నామే తప్ప ప్రయాణంలో ఉన్నామని చెబుతున్నా పట్టించుకోకుండా వాహనం తీసుకొనే పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు. ఒంగోలు నగరంలో వేమల శ్రీనివాస్ కుటుంబం తిరుమల వెళ్తుంటే రవాణా శాఖ అధికారులు బలవంతంగా వారి వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం విస్మయానికి గురి చేసిందన్నారు.
సీఎం కాన్వాయ్ కోసం ప్రయాణికులను నడిరోడ్డున దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకోవల్సిన పరిస్థితి ఎందుకు కలిగిందన్నారు. ‘‘రూ.2.56 లక్షల బడ్జెట్ కలిగి… రూ.7.77 లక్షల కోట్లు అప్పు తెచ్చుకొన్న సామర్థ్యం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పర్యటనకు ప్రైవేట్ వ్యక్తుల వాహనాలు తీసుకోవడం ఏమిటి? ముఖ్యమంత్రి భద్రత పర్యవేక్షించే అధికారులు కాన్వాయ్ లో ప్రైవేట్ వాహనాలు అనుమతిస్తున్నారా…. అనుమతిస్తే ఏ ప్రాతిపదికన ఆ వాహనాలు తీసుకొంటున్నారో వివరించాలి. లక్షల కోట్ల బడ్జెట్, అప్పులు కలిగిన ప్రభుత్వం సొంతంగా వాహనాలు సమకూర్చుకోలేని పరిస్థితిలో ఉందా అనే సందేహాలు నెలకొంటున్నాయి.
ఒంగోలు ఘటనలో ఒక సహాయ అధికారిని, ఒక హోమ్ గార్డుని సస్పెండ్ చేసేసి విషయాన్ని మరుగునపట్టిద్దామని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉంది. ట్రావల్ ఆపరేటర్స్ నుంచి అద్దెకు తీసుకోకుండా ప్రయాణీకులను నడిరోడ్డుపై వదిలి వాహనాన్ని తీసుకోవాల్సిన ఒత్తిడితో కూడిన పరిస్థితి ఆ ఉద్యోగులకు ఎందుకు కలిగిందో విచారించాలి. సదరు ఉద్యోగులపై ఆ స్థాయి ఒత్తిడిని రాజకీయ నాయకులు తీసుకువచ్చారా?’’ అని ప్రశ్నించారు.