ఆంధ్రప్రదేశ్‍లో మంత్రులంతా బస్సు యాత్ర చేయనున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులు పాల్గొంటారని వివరించారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళంలో ప్రారంభమై అనంతపురంలో బస్సు యాత్ర ముగియనుందని తెలిపారు. ఈ నెల 26 నుంచి 29 వరకు బస్సు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. బలహీనవర్గాలకు సీఎం జగన్ అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. బీసీలకు సీఎం జగన్ మాత్రమే న్యాయం చేశారని స్పష్టం చేశారు.
బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల సాకారం దిశగా జగన్ అడుగులు వేశారని అన్నారు. బస్సు యాత్ర నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్తాం అని ప్రకటాంరు. తాము ఏం చేశామో చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కేబినెట్‍లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 77 శాతం మంత్రి పదవులు ఉన్నాయని తెలిపారు. తెలంగాణకు చెందిన బీసీ వ్యక్తికి రాజ్యసభ ఇస్తే తప్పు పడుతున్నారని, ఎక్కడున్నాడనేది కాదు.. ఆయా వర్గాల ఘోష వినిపించే వ్యక్తి కావాలని స్పష్టం చేశారు.
చంద్రబాబు ఎక్కడ ఉంటున్నారు? తెలంగాణలో కాదా? అని ప్రశ్నించారు. బలహీనవర్గాలకు చంద్రబాబు ఏనాడైన ప్రాధాన్యత ఇచ్చారా? అని నిలదీశారు. బలహీనవర్గాలకు ప్రాధాన్యతను చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. మంత్రుల బస్సు యాత్రపై టీడీపీ నేతలు విమర్శులు గుప్పిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని, అందుకే ఇప్పుడు అంతా కలసి బస్సు యాత్ర నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఇక మిగిలింది గాలి యాత్రేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు.