Site icon 123Nellore

వాళ్ల వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయాం : అచ్చెన్నాయుడు

ఉద్యోగుల వల్లే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఉద్యోగులు భయపడో.. ఏదో ప్రలోభాలకు గురయ్యో ఉద్యోగులు లొంగిపోయారని చెప్పారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పార్టీ నేతలతో ఎన్నికలు ముందుగానే వస్తాయని చెప్పినట్లు పేర్కొన్నారు. హనుమాన్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన రైతు నేతల శిక్షణా శిభిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 13 జిల్లాల నుండి రైతులు నేతలు హాజరయ్యారు. ఈ సదస్సులో అచ్చెన్నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.

రైతులను సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగునా మోసం చేసిందని మండిపడ్డారు. జగన్ సర్కార్ ఏ ఒక్క రంగాన్ని వదిలిపెట్టకుండా నాశనం చేసిందని, కలలో లేచి రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తున్నట్లు లెటర్ ఇచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదంటూ ఎద్దేవా చేసారు. వైఎస్ వివేకా హత్య కేసును టీడీపీకి అంటగట్టాలని చూశారని, వివేకానందరెడ్డి హత్య ద్వారా వచ్చిన సింపతితోనే జగన్ సీఎం అయ్యారని ఆరోపించారు. కోడికత్తి డ్రామా సింపతి పని చేయలేదనే వివేకా హత్యకు తెర తీశారని విమర్శించారు.

హత్య కేసులో నిందితులను ఎందుకు శిక్షించడం లేదని ప్రశ్నించారు. రైతు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. జగన్ రెడ్డి పోలీసులను గుప్పిట్లో పెట్టుకొని టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అన్నా అంటూ సీఎం జగన్ సవాంగ్ కు సున్నం పెట్టాడని ఎద్దేవా చేశారు.  ఏపీలో ఏ క్షణంలో అయినా ఎన్నికలు రావచ్చని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీకి 150 సీట్లకు పైగా వస్తాయని జోస్యం చెప్పారు. రెండేళ్లు ఉందని నిద్రపోవద్దు.. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Exit mobile version