Site icon 123Nellore

ముగ్గురు కలిసొచ్చినా మాకు నష్టం లేదు : వైసీపీ

రాష్ట్ర ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితిలేదని ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ హయాంలోనే రాయలసీమ అభివృద్ధికి ముందడుగు పడిందన్నారు. కడపలో బీజేపీ నేతలు నిర్వహించిన రణభేరిపై ఆయన కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ మరింత మేలుచేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్ర సహకారం లేనందునే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం ముందుకు సాగకుండా ట్రిబ్యునల్‌ స్టే ఇచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా వైసీపీకి నష్టమేమీలేదన్నారు.  ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదాను ఏపీకి ఎందుకివ్వలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చెయొద్దని ఎన్నిసార్లు మొత్తుకున్నా లాభం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. విభజనవల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీలో ఇప్పుడున్న సమస్యలను పరి ష్కరించడం చేతగాని బీజేపీ, కొత్త సమస్యల పరిష్కారం కోసం పోరాడటం హాస్యాస్పదమన్నారు.

విభజన చట్టంలో పేర్కొన్న ఏ సమస్యనూ ఇంతవరకూ పరిష్కరించలేదని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కూడా ఇవ్వలేదన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. పెండింగ్‌లో ఉన్న గాలేరు–నగరి, హంద్రీ–నీవా, గండికోట ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు, తాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కడపలో జరిగిన జిల్లా  పరిషత్ సమావేశం అనంతరం వైసీపీ నేతలు బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Exit mobile version