గడప గడపకూ కార్యక్రమంపై నెలకోసారి వర్క్ షాపు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు విజయం సాధించాలన్న లక్ష్యంతోనే పని చేయాలని, కుప్పం మున్సిపాలిటీనీ గెలుస్తామని ఎవరైనా అనుకున్నారా అని అన్నారు. కష్టపడితే అన్ని విజయాలేనని పేర్కొన్నారు. బుదవారం తన క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేలు, మంత్రులకు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహించినారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. గడప గడపకు కార్యక్రమంలో వచ్చిన ఫీడ్ బ్యాక్‌పై వర్క్ షాపులో చర్చిస్తామని తెలిపారు. మనకు ఓటు వేయనివారికి కూడా రాజకీయాలు, పార్టీలు చూడకుండా పారదర్శకంగా మేలు చేశామని అన్నారు. సంతృప్తి స్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నామని, చేసిన సంక్షేమంతో కాలర్ ఎగరేసుకుని తిరగగలుగుతున్నామని అన్నారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు పథకాలు చేరాయని పేర్కొన్నారు. ప్రతి సచివాలయంలో కచ్చితంగా 2 రోజులు గడపగడపకూ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రతి సచివాలయంలో ఉదయం నుంచి సాయంత్రం 7 వరకు గడపగడపకూ నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు. మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులకు సీఎం పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు. గడప గడపకూ అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమం అని, దాదాపు 8 నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఒక్కో సచివాలయానికి రెండు రోజులపాటు సమాయాన్ని కేటాయించాలన్నారు. నెలలో 20 రోజుల చొప్పున 10 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రతి నెలలో 10 సచివాలయాలు నిర్వహించేలా ఎమ్మెల్యేలు ప్రణాళిక వేసుకోవాలని, ప్రతి నెలలో 20 రోజులు గడప గడపకూ నిర్వహించాలని ఆదేశించారు.