ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తేలేదని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృస్ణారెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో 90 శాతం హామీలు నెరవేర్చామని ఉద్ఘాటించారు. వైసీపీ 12వ ఆవిర్భావ వేడుకలను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. ముందస్తు ఎన్నికలంటూ జరుగుతాన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.వైసీపీ వచ్చాక రాజకీయాల్లో సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు.
అధికారం కోసం కాకుండా పేదల కోసం పనిచేసే పార్టీగా వైసీపీ ఆవిర్భవించిందన్నారు. నవరత్నాలతో జగన్ నాటిన విత్తనాలకి పండ్లు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు సంక్షేమానికి జగన్ పెద్ద పీఠ వేస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాలకు సాధికారత వచ్చేలా చేశారని వెల్లడించారు. మహిళలకు నిజమైన సాధికారత కల్పించేలా 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, జగన్ ఏపీలోని విద్యా వ్యవస్థ లో సమూల మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. ప్రభుత్వ స్కూల్స్ లో సీట్లు కాళీ లేనంతగా నిండిపోయాయని, సీటు కోసం ఎమ్మెల్యేల సిఫార్సు చేసే పరిస్థితి నెలకొందని అన్నారు.
కుప్పంతో సహా అన్ని ప్రాంతాల్లో టీడీపీని రాష్ట్రంలో చెత్త బుట్టలో పడేసారని, అండమాన్ లో రెండు వార్డులు గెలిస్తే సంబరాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఈసారి 160 సీట్లు వస్తాయి ప్రచారం చేసుకుంటున్నారని, ఇది విని ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి తెలిసిన విద్య వెన్నుపోటు ఒక్కటే అంటూ దుయ్యబట్టారు. టీడీపీ సినిమాకి 2024 లో శుభం కార్డు పడబోతుందని, వైసీపీకి వీళ్ళేవరు ప్రత్యర్ధులు కారని స్పష్టం చేశారు. టీడీపీ కుట్రలు ప్రజలకు చెప్పాలని సుచించారు. 2024 లో శాశ్వతంగా టీడీపీని తుడిచెయ్యాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూలై లో వైసీపీ ప్లీనరీ జరుగుతుందని తెలిపారు.