అసెంబ్లీ వేదికగా ఏపీ మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతకంటే మెరుగైన బిల్లతో త్వరలోనే ముందుకొస్తానని అన్నారు. ఈ క్రమంలోనే మూడు రాజధానుల విషయంలో ఎలాంటి చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతోనే జగన్ పాత ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే, ఈ విషయంపై నాయకులతో సుదీర్ఘ చర్చ జరిపి ఓ తీర్మానానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, శ్రీరామనవమి రోజున రాజధాని విషయంలో జగన్ నూతన ప్రకటన చేయనున్నారని సమాచారం.
అసలు ఎటూ సాగని రాజధాని సమస్యపై జగన్ సర్కారు పరిష్కార దిశగా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా, తాజాగా, ఈ విషయంపై ఏపీ మంత్రి ఒకరు స్పందించి.. రానున్న ఉగాది తర్వాత.. రాజధాని విషయంలో జగన్ కీలక ప్రకటన చేస్తారని చెప్పకనే చెప్పేశారు. మూడురాజధానుల బిల్లు రద్దుకు ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవమే. ఇదే ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. మరోవైపు అమరావతి రాజధానిగా ఉండాలంటూ అక్కడి రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. దీనికి తోడు వారికి అండగా ఉంటామని ప్రతిపక్షపార్టీలూ నిలబడటం.. ప్రస్తుతం వైకాపాకు పెద్ద సమస్యగా మారింది.
అయితే, ప్రభత్వంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ మాత్రం రాజధానిగా విశాఖనే చెప్తూ వచ్చారు. అలా చేస్తేనే వైకాపా తమ పంతాన్ని నెగ్గించుకున్నట్లు ఉంటుందనుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి రైతుల నిరసనలకు తగ్గి అమరావతిని రాజధానిగా ప్రకటిస్తారా?.. లేక విశాఖ రాజధానిగా వస్తుందా?.. అన్నది తెలియాల్సి ఉంది.