వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోందని, టీడీపీలోకి వెళ్లాలంటే వెళ్లొచ్చు కానీ వ్యక్తిగత హననం సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జలదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైఎస్ వివేకా హత్యపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు నడుపుతున్న నాటకాలు బయటపడుతున్నాయని, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మూడేళ్లుగా కుట్రలు పన్నడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని, ఓ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రజల్లో విషం ఎక్కించే కుట్ర జరుగుతోందని విమర్శించారు.
ఎల్లో మీడియా దిగజారుడు కథనాలు ప్రచారం చేస్తోందని, చంద్రబాబు, ఎల్లో మీడియా చేస్తోంది పూర్తిగా రాజకీయ కుట్రేనని ఆక్షేపించారు. ఒకరి తర్వాత ఒకరు కుట్రపూరితంగా దుష్ప్రాచారం చేస్తున్నారని, కుట్రపూరితంగా వెనకుండి చంద్రబాబే నాటకమాడిస్తున్నారన్నారు. వివేకా హత్య కేసులో రాజకీయరంగు పులిమి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంతగా బురదజల్లుతున్నా ఇంతకాలం ఓపిగ్గా ఉన్నామని, ఎలాంటి ఆధారాలు లేకుండా సునీత ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేతిలో సునీత పావుగా మారారని అనిపిస్తోందన్నారు.
వివేకా సొంత కుటుంబ సభ్యులే ఆరోపణలు చేయడం దారుణమని, ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు. కనీసం సిగ్గూ, ఎగ్గూ లేకుండా కథనాలు ప్రచారం చేస్తున్నారని, వివేకా ఇంట్లో వారుపెట్టిన మనుషుల సమక్షంలోనే హత్య జరిగిందని వివరించారు. ముందుగా అక్కడి నుంచే విచారణ ప్రారంభించాలి కదా? అని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేక వివేకా కుమార్తె, అల్లుడిని కలుపుకుని చంద్రబాబు కుట్రకు తెరలేపుతున్నారని విమర్శించారు. సీబీఐ విచారణను ప్రభుత్వం కూడా స్వాగతించిందని, ఎన్డీఏ నుంచి బయటకు రాగానే చంద్రబాబులా సీబీఐకి నో ఎంట్రో అని మేం చెప్పలేదన్నారు.