Site icon 123Nellore

సినిమా టికెట్ల కోసం విజయవాడ మేయర్ రిక్వెస్ట్..!

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్” ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం నిరీక్షణ తర్వాత ఈ రోజు అంటే మార్చి 11న థియేటర్లలోకి ప్రభాస్ సినిమా రావడంతో అభిమానుల సంతోషానికి అంతులేకుండా పోయింది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే తాజాగా 100 టికెట్లు కావాలంటూ విజయవాడ మేయర్ రిక్వెస్ట్ చేస్తూ మల్టీప్లెక్స్ యజమానికి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

సినిమా విడుదల సందర్భంగా మెుదటి రోజు ప్రతి షోకు మల్టీప్లెక్స్‌ థియేటర్లు 100 టికెట్లు పంపాలని విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి లేఖలో కోరారు. ఈ మేరకు అన్ని మల్టీప్లెక్స్‌ల థియేటర్లకు లేఖలు రాశారు. పార్టీ కార్పొరేటర్లు, నాయకులు సినిమా టికెట్లు అడుగుతున్నారని.. వారి కోసం సినిమా టికెట్లను ఛాంబర్‌కు పంపాలని మేయర్ కోరారు. అందుకు అయ్యే డబ్బులు కూడా చెల్లిస్తామని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, నేరుగా నగర మేయర్ నుంచి టికెట్ల కోసం లేఖ రావటంతో థియేటర్ యజమానులు విస్తుపోయారు.

తాను మేయర్‌గా ఉన్నందున కొత్త సినిమాలు విడుదలైన రోజున కార్పొరేటర్లు, నాయకులు టికెట్ల కోసం తనను అడుగుతున్నందునే ఈ లేఖ రాస్తున్నట్లు తన అనుచరులతో చెప్తున్నారంట. ఈ వ్యవహారంపై మేయర్‌ ఇంకా స్పందించలేదు. ఇక మేయర్‌ లేఖపై విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై ఆలోచించాల్సింది పోయి సినిమా టికెట్ల కోసం వెంపర్లాడటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇక సోషల్‌ మీడియాలో సైతం ఈ లేఖపై భిన్నమైన కామెంట్స్‌ వస్తున్నాయి.

Exit mobile version