ఏడు పదుల వయసుదాటిన నీకు ఉత్తుత్తి శపథాలు అవసరమా చంద్రబాబు అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం తన ట్విట్లర్లో చంద్రబాబుపై సెటైర్లు కురిపించారు. ముఖ్యమంత్రి అయ్యాకే మళ్లీ శాసనసభలో అడుగుపెడతానని జయలలిత స్టయిల్లో చంద్రబాబు కూడా శపథాలు చేశారని ఆయన అన్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అని తన పార్టీ నేతలతో సమీక్షలు చేస్తున్నారని విమర్శించారు.
ఇకపై చంద్రబాబుకు అసెంబ్లీకి వెళ్లే అవకాశమే రాదని అన్నారు. అసెంబ్లీని చంద్రబాబు బహిష్కరించాల్సిన అవసరం లేదని… ప్రజలే చంద్రబాబును అసెంబ్లీ నుంచి బహిష్కరిస్తారని ఎద్దేవా చేశారు. అయితే గతేడాది నవంబర్ 19న అసెంబ్లీలో తనను వైసీపీ సభ్యులు అవమానించారని, అసెంబ్లీ నుండి బయటకు వచ్చిన విషయం అందిరికీ తెలిసిందే. ఈ సందర్భంగా తాను మాట్లాడటానికి మైకు ఇవ్వమంటే స్పీకర్ ఇవ్వలేదని చంద్రబాబు సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ సీఎం అయ్యాకే సభకు అడుగుపెడతానని, ఇలాంటి కౌరవ సభలో ఉండాల్సిన అవసరం తనకు లేదన్న చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను టీడీపీ నేతలు బయటపెట్టారు.
అయితే రెండుమూడు రోజుల నుండి టీడీపీ సీనియర్ నేతలతో సమావేశమవుతున్న చంద్రబాబు తాను తప్ప మిగిలిన నేతలను అసెంబ్లీకి పంపాలని యోచిస్తున్నారు. ప్రజల సమస్యలపై అసెంబ్లీలో పోరాడాలని నేతలకు దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం. ఏయే అంశాలను సభలో ప్రస్తావించి, అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టాలన్న దానిపైనా చర్చించారు. అయితే తన లక్ష్యం ప్రకారం సీఎం అయ్యాకే అసెంబ్లీకి వెళ్తానని శపథం చేసిన చంద్రబాబు తన ఎమ్మెల్యేలను పంపడం కరెక్టు కాదని, చంద్రబాబుకు ఉన్న లక్ష్యం తన ఎమ్మెల్యేలకు లేదా అన్న ప్రశ్నను పలువురు విశ్లేషకులు లేవనెత్తుతున్నారు.