గన్నవరం టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ టీడీపీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని తాను ఎప్పుడూ తిట్టలేదని, టీడీపీని లోకేష్ బాబు నడిపిన తీరును మాత్రమే తాను తిట్టానని అన్నారు. అంతేగాని టీడీపీ చెడ్డపార్టీ అని ఎప్పుడు తిట్టలేదన్నారు. టీడీపీ చాలా గొప్పపార్టీ అని, దాన్ని ఎన్టీఆర్ స్థాపించారని పేర్కొన్నారు. టీడీపీ వల్లే సామాజిక న్యాయం జరిగిందని, బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయంగా అవకాశం లభించిందని అన్నారు. రాజకీయ చరిత్ర లేని వారందరికీ అవకాశం కల్పించి, సేవ చేసే అవకాశాన్ని టీడీపీ కల్పించదన్నారు.
ఇదే విషయాన్ని తాను చాలా సార్లు చెప్పానని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు టీడీపీ లోకేష్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత దాని విధానం సరిగా లేదని మాత్రమే విమర్శించానని అన్నారు. దుట్టా రామచంద్రారావుకు టీడీపీతో ఏమైనా సంబంధాలు ఉంటే ఆయన్ను అడగాలని మీడియాకు సూచించారు. అయితే వంశీ వ్యాఖ్యలతో అక్కడున్న వైసీపీ నాయకులు అవాక్కయ్యారు. టీడీపీ పేరు వింటేనే ఒంటి కాలితే లేచే వంశీ, పార్టీ గురించి పాజిటివ్ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇదిలా ఉండగా వంశీ వైసీపీలోనే ఉంటారా..రాజకీయ విరామం తీసుకుంటారన్న చర్చ నడుస్తోంది. వంశీతో కలిసి నడిచే ప్రసక్తే లేదని మరోసారి తేల్చి చెప్పారు. వంశీతో కలవను..వైసీపీని వీడనని ఓ వైపు దుట్టా రామచంద్రారావు చెప్తున్నా, సీటుపై క్లారిటీ లేకపోతే పార్టీ మారుతారని కూడా తెలుస్తోంది. వైసీపీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునే పనిలో దుట్టా ఉన్నట్లు తెలుస్తోంది. గన్నవరం రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాల్సి ఉంది