వైసీపీ నేతలు దుట్టా రామచంద్రారావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఘాటు విమర్శలు చేశారు. తన చేతిలో సింగిల్‍గా గ్రూపులు గ్రూపులుగా ఓడిపోయారని విమర్శించారు. ఈగో వల్ల ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని, గత మూడు ఎన్నికల్లో వాళ్లని ఒక్క అడుగు కూడా వేయనివ్వలేదు.. అందుకే తాను నచ్చను అని మండిపడ్డారు.- నియోజకవర్గంలో ఎవరూ తనపై ఆధిపత్యం సాధించలేకపోయారని దుయ్యబట్టారు. తనకు ఎవరితో సమస్య లేదు.. వారికి ఎవరితో ఉందో తెలియదన్నారు. నియోజకవర్గ సమస్యలపైనే సీఎం పేషీకి వెళ్లానని, దుట్టాని, తనను కూర్చొబెట్టి మాట్లాడింది లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గ నాయకులకి మాతో సమస్యా?.. పార్టీతో సమస్యా? అని మీడియాను ప్రశ్నించారు.
అధిష్ఠానంతో సమస్యా అనేది అర్థం కావడం లేదన్నారు. వైసీపీ క్యాడర్‍ను ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదని, జగనన్న కాలనీల కోసమే గ్రామస్తులు మట్టితవ్వుకుంటున్నారని వివరణ ఇచ్చారు. యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు అందరం కలిసే పనిచేసుకుంటున్నాం అని తెలిపారు. అయితే నిన్ననే దుట్టా, ఆయన వర్గం సీఎం పేషీతో చర్చలు జరిపారు. వంశీతో కలిసి ప్రయాణం చేసే ప్రసక్తే లేదని, వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టి జగన్ ను తిట్టారని తెలిపారు.
గౌరవం లేని చోట తాము ఉండలేమని, మరోసారి చర్చలకు పిలుస్తారని చెప్పారని వివరించారు. నేడు వంశీ భేటీ కావడంతో కొంత ఆసక్తి నెలకొంది. వంశీ వెనక కొడాలి నాని ఉన్నారు. నాని మాటను కాదని జగన్ మరొకరికి సీటు ఇచ్చే అవకాశం లేదు. ఇదే లెక్కలను వంశీ వర్గం వేస్తోంది. మరి యార్లగడ్డ వెంకట్రావు వంశీ విషయంపై ఏం స్పందిస్తారో చూడాల్సి ఉంది.