జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళాసంక్షేమం, రక్షణ అనేది నేతిబీరలో నెయ్యి చందమే అయ్యిందని టీడీపీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత మండిపడ్డారు. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. నేరచరితుడైన ముఖ్యమంత్రి అండదండలతో వైసీపీ కాలకేయులు, కామాంధులు ఆడబిడ్డలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, పోలీస్ వ్యవస్థ తమనేమీ చేయలేవన్న మృగాళ్ల అహంకారం మహిళలు చిన్నారుల జీవితాలను చిధిమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ నేత వేధింపులకు బలైన వీఓఏ నాగలక్ష్మి, యడ్లపాడు మండలం బోయపాలెంలో అధికార పార్టీనేత కుమారుడి దాష్టీకానికి గురైన అంగన్వాడీ ఆయాల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఏం న్యాయంచేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు. వీఓఏ నాగలక్ష్మి చనిపోయినా, అంగన్ వాడీ ఆయా వేధింపులకు గురైనా ప్రధాన కారకులు తన పార్టీవారేనన్న నిజం ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. సినిమా టిక్కెట్లపై చంద్రబాబు, లోకేశ్ పై ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే పేర్ని నానీ తన అనుచరుడి వికృతానికి బలైన నాగలక్ష్మీ కుటుంబానికిఏం న్యాయంచేస్తాడో చెప్పాలన్నారు.
హోంమంత్రిగా మహిళా ఉన్నా రబ్బర్ స్టాంపులా, శిశు సంక్షేమశాఖా మంత్రి ముఖ్యమంత్రి భజనలో మునిగితేలుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాల దుస్థితి ఎలా ఉందో…అక్కడి చిన్నారులు ఎందుకు ఆకలి కేకలు వేస్తున్నారో ఏనాడైనా మంత్రిఆలోచించారా అని ప్రశ్నించారు. మహిళా సంక్షేమం, మహిళాభ్యున్నతి, మహిళా సాధికారత అనేపదాలు ఉచ్చరించే హక్కు కూడా ఈ ముఖ్యమంత్రి మంత్రులకు లేదన్నారు. న్యాయమైన డిమాండ్లతో రోడ్డెక్కిన ఏఎన్ఎంలు, అంగన్వాడీ, ఆశావర్కర్లపై పోలీసు జులుం ప్రయోగించడమేనా జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మహిళా సంక్షేమం అని నిలదీశారు.