దమ్ముంటే లోకేష్ తనపై పోటీ చేసి గుడివాడలో గెలవాలని మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. అసెంబ్లీ వద్ద మీడియాతో నాని శుక్రవారం మాట్లాడారు. మీలా వెన్నుపోటు పొడిచే రక్తం కాదని, జగన్ నువిమర్శించే ముందు మీ చరిత్ర ఏంటో తెలుసుకోండని హితవు పలికారు. న్యాయస్థానాలపై అచంచలమైన గౌరవం ఉందని జగన్ చెబితే.. కించపరిచారని తండ్రీకొడుకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం సమగ్రమైన అభివృద్ధి జరగాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలని అసమానతలకు తావులేకుండా పరిపాలనను, అభివృద్ధిని వికేంద్రీకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తాను నమ్మిన సిద్ధాంతాన్ని స్పష్టంగా, ఎలాంటి అరమరికలకు తావు లేకుండా రాష్ట్ర ప్రజానీకానికి అర్థమయ్యేలా చెప్పారన్నారు.
కొంతమంది శాసనసభ్యులుగా కూడా గెలవలేని బచ్చాగాళ్లు, ప్రజల్లో ఆదరణ కూడా లేని, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే చెత్తగాళ్లు ముఖ్యమంత్రి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేశంతో ఊగిపోయారు. మా తాత ముఖ్యమంత్రి, మాకో పార్టీ ఉంది, మా బాబు ముఖ్యమంత్రి, అతనో ప్రపంచ మేధావి, ఆయనకో పెద్ద విజన్ ఉందంటూ సొల్లు మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా చంద్రబాబుకు విజనరీనే ఉంటే.. తన కొడుకుని ఎమ్మెల్యేగా కూడా ఎందుకు గెలిపించలేకపోయాడని ప్రశ్నించారు.
50 శాతం ఓట్లు, 86 శాతం సీట్లతో వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రి చేసిన రాష్ట్ర ప్రజలు అమాయకులు అని, తండ్రీకొడుకులే తెలివిగలవాళ్ళు అని వారికి వారే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పప్పుగా గుర్తింపు పొందిన లోకేష్ అయితే కనీసం బుద్ధీ- జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్‌లో ప్రవహించే రక్తం వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డిదన్నారు. జగన్ ను విమర్శించే ముందు మీ చరిత్ర ఏంటో ముందుగా తెలుసుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు.