ఆ కుర్రోడు ట్రెక్కింగ్ చేద్దామనుకున్నాడు. అందుకోసం కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు నందిహిల్స్ కు వెళ్లాడు. నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తే మజా ఉంటుందని భావించాడు. కానీ అనుకోని ప్రమాదం అతడిని ఇరకాటంలోకి నెట్టింది. అయితే భూమిపై ఇంకా నూకలు మిగిలి ఉన్నాయో ఏమో కానీ… చావు చివరి అంచుల దాకా వెళ్లి బతికి బట్టకట్టాడు. ఇదంతా ది గ్రేట్ ఇండియన్ ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ వల్లే సాధ్యమైంది.
దిల్లీకి చెందిన 19ఏళ్ల కుర్రోడు నిశాంక్ శర్మకు ట్రెక్కింగ్ అంటే మహా సరదా. అందుకే దేశవిదేశాల నుంచి ట్రెక్కింగ్ కోసం వెళ్లే నందిహిల్స్ కు వెళ్లాడు. కానీ ఊహించని విధంగా కిందపడిపోయాడు. కొండపైనుంచి ఏకంగా 300 అడుగుల కిందకు పడిపోయాడు. అదృష్టవశాత్తు మధ్యలో ఇరుక్కుపోయాడు. కాపాడమని గట్టిగా కేకలు వేశాడు. కానీ ఫలితం లేదు. కాగా అతడి జేబులో ఉన్న ఫోన్ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం చిక్ మంగళూరు పోలీసులకు సమాచారం అందించారు.
కొండ నుంచి దిగువకు పడిపోవడంతో పోలీసులు ఆర్మీకి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ… రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఆ కుర్రోడు ప్రాణాలతో బయటపడ్డాడు. స్వల్ప గాయాలపాలైన యువకుడిని బెంగళూరు ఆస్పత్రికి తరలించారు.