Site icon 123Nellore

వాళ్లను ఇంకేం చేయాలి : అంబటి రాంబాబు

కరోనా వల్ల రెండేళ్లు అసెంబ్లీ సమావేశాలు సరిగా జరగలేదని ఇప్పుడు సమయం ఉన్నా సభా సంప్రదాయానికి విరుద్ధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రవరిస్తున్నారని వైసీపీ  ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. దేవాలయం లాంటి శాసనసభలో ప్రజల సమస్యలపై చర్చ జరగకుండా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారని అన్నారు. స్పీకర్ పోడియం, వెల్‌లోకి, స్పీకర్‌ చైర్‌ దగ్గరకు వెళ్లి వేళ్లు చూపిస్తూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారిని సస్పెండ్ చేయకుంటే ఇంకేమీ చేయాలని ప్రశ్నించారు.

గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనే అడ్డంకులు కలిగించారని మండిపడ్డారు. మద్యంపై తమ ప్రభుత్వం విధానం ప్రజలకు తెలుసన్నారు.  కల్తీ మద్యం, మద్య నియంత్రణ కోసం ప్రభుత్వం ఎస్ఈబీ డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ప్రజలను నమ్మించేందుకు సభలో కల్తీ సారాపై ఆందోళన చేశారని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సభకు రాకుండా వేరే వాళ్లను పంపించి గొడవ చేయిస్తున్నారని మండిపడ్డారు. గొడవ చేస్తే సభ నుంచి సస్పెండ్ చేయడం అనేది ఎప్పటి నుండో ఉందన్నారు.

చంద్రబాబు ఏదో వంక పెట్టుకుని ఇంటి దగ్గరే ఉన్నారని, టీడీపీ నాయకులు కూడా అలానే ఉంటే సరిపోయేదని, అసెంబ్లీకి వచ్చి గందరగోళం సృష్టించడం ఎందుకు..?  జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. సహజ మరణాలని ఆరోగ్యశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ప్రకటించినా.. ప్రభుత్వానికి ఆపాదించాలని ఉద్దేశంతో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఒక అబద్దాన్ని పదేపదే చెప్పి.. ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version