విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని ప్రమాణ స్వీకార సభలో జగన్ రెడ్డి ప్రకటించి మాటతప్పి, మడమ త్రిప్పి అసాధారణంగా మూడేళ్లలోనే రూ.42,872 కోట్ల విద్యుత్ భారాల్ని ప్రజలపై మోపారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకంట్రావు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి రూ. 16,611 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.26,261 కోట్లు ప్రజలపై భారం మోపారు. ఒకే ధపాలో దాదాపు 60 శాతం కరెంటు ఛార్జీలు పెంచడం బహుశ భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. పాత ఛార్జీల ప్రకారం 75 యూనిట్లు లోపు వాడే వారు యూనిట్ కు 2.60 మాత్రమే చెల్లించే వారు. కానీ ఈ.ఆర్.సి దీన్ని 3.10 గా పేర్కొని ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది.
ఛార్జీల పెంపుదలలో కూడా అత్యంత దుర్మార్గంగా పేదవారిపై ఒక రకంగా, సంపన్న వర్గాలపై ఒక రకంగా వ్యవహరించిన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు ప్లాంట్లు సిద్దంగా ఉన్నా వాటిని సక్రమంగా పనిచేయించలేకపోతున్నారు. 230 యూనిట్ల రోజువారి అవసరత ఉన్నా దాదాపు 50 మిలియన్ యూనిట్ల లోటులో ప్రభుత్వ విద్యుత్ ప్లాంట్లను నడుపుతున్నారు.
దీంతో రోజుకు రూ.60 కోట్లు హెచ్చించి బహిరంగ మార్కెట్ లో కొనాల్సిన పరిస్థితి రాష్ట్రానికి దాపురించిందిపోలవరంలో 960 మెగావాట్ల జల విద్యుత్ ప్లాంట్ నిర్మాణం సకాలంలో పూర్తి చేయకపోయారు. 5 శాతం పనులు పూర్తి చేస్తే నెల్లూరులో దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యు ప్లాంట్ రెండో దశ పూర్తి చేసుకుని 800 మెగావాట్లు చేతికి వస్తుంది. జగన్ రెడ్డి అదీ చేయలేక ఇప్పుడు దాన్ని ప్రైవేటుకు ఇవ్వాలని చూస్తున్నారు. చేతగాని అసమర్ధ పాలనతో రాష్ట్ర ప్రజలను అందకారంలోకి నట్టే హక్కు జగన్ రెడ్డికి ఎవరిచ్చారు?’’ అని ప్రశ్నించారు.