సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడిన చైతన్య మూర్తి బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నానని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తన ట్విట్టర్లో మంగళవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నట్లు పోస్టు పెట్టారు.దళిత హక్కుల పరిరక్షకులు బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం దళిత జాతిని జాగృతం చేసిందని కొనియాడారు. దళితులకు విద్య, ఉపాధి, గౌరవం, రక్షణ అనే లక్ష్యంతో తెలుగు దేశం ఎప్పుడూ పని చేసిందని వివరించారు. 2.74 లక్షల మంది దళిత యువత ప్రభుత్వ రుణ సదుపాయంతో వ్యాపారాలు చేసినా, రోడ్లు, మౌళిక సదుపాయాలతో దళిత కాలనీల్లో వెలుగులు నిండినా…అది తెలుగు దేశం హయాంలోనేనని గుర్తు చేశారు. దళితుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో పనిచేసిందని పేర్కొన్నారు.
దళితులపై దాడి చేసి..వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టే ప్రభుత్వంపై మనం పోరాడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నేడు నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు జాతి బిడ్డల భవిష్యత్ కాలరాస్తున్న ఈ ప్రభుత్వంపై తిరగబేందుకు ప్రతి దళిత వర్గం సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాల నుండి బయటపడేందుకు, తమ భవిష్యత్ కోసం దలితులు పోరాడాలని వివరించారు. దళిత ప్రజల భవిష్యత్ కు భరోసా, వారికి సరైన గౌరవం ఇవ్వడమే బాబు జగ్జీవన్ రామ్ మనమందించే అసలైన నివాళి అని ఉద్ఘాటించారు.