అమరావతిపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతినే ఏపీ రాజధానిగా నిర్ధారిస్తూ 2022-23 బడ్జెట్లో కేంద్రం కేటాయింపులు చేసింది. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించింది. ఏపీ నూతన రాజధాని అమరావతి పేరుతోనే బడ్జెట్లో ప్రొవిజన్ ను కేంద్రం ప్రవేశపెట్టింది. కేంద్ర బడ్జెట్లో పట్టణాభివృద్ధి శాఖ నుంచి అమరావతిలో సచివాలయం, ఉద్యోగుల నివాస గృహాల నిర్మాణానికి నిధుల కేటాయించింది.
సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్లు అంచనా వ్యయంగా పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల కోసం రూ.1,126 కోట్లుగా అంచనా వేసింది. GPOAకి భూసేకరణ కోసం రూ.6.69 కోట్ల అంచనా వ్యయంగా పేర్కొని 2020-21, 2021-22 బడ్జెట్లో మొత్తం రూ.4.48 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. ఉద్యోగుల నివాస గృహాలకు అవసరమైన భూ సేకరణకు 2021-22లో రూ.21 కోట్లు అంచనా వేసి ఇప్పటికి రూ.18.3 కోట్లు ఖర్చు చేసింది. 300 ఏజీ స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.200 కోట్లు అంచనా వ్యయంగా కేంద్రం నిర్ధారించింది.
పట్టాభివృద్ధి శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ లో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ విషయంపై వైసీపీ నేతలకు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లు అయింది. ఇన్ని రోజులూ కేంద్రం తన వైఖరి చెప్పాలని రైతులు నిత్యం బీజేపీని ఇరకాటంలో పెడుతున్నారు. దీంతో బీజేపీకి రాజధాని పట్ల ఉన్న వైఖరి ఏంటో దీంతో స్పష్టమైంది. అయితే కేంద్రం నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా వచ్చే అసెంబ్ల్లీ సమావేశాల్లో మూడు రాజధానులు బిల్లు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఈనెల నుండి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మంత్రి మండలి కూడా అదే రోజున జరగనుంది. ఆ రోజు రాజధానిపై ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.