ముఖ్యమంత్రి జగన్ పై ఏపీ బీజేపీ నేతలు ఒక్కసారిగా విమర్శలతో దూకుడు పెంచారు. జగన్ పాలనపైనా, వివేకా హత్యపైనా విమర్శలు సంధించారు. శనివారం కడపలో నిర్వహించిన రణభేరి సభలో బీజేపీ నేతలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. అనేక వనరులున్న ప్రాంతం.. రాయలసీమ అని, రాయలసీమలో విలువైన ఎర్రచందనం ఉందన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. సూక్ష్మ నీటిపారుదలకు అసలు మంత్రే లేరని, రాష్ట్రంలో కక్ష పూరిత పరిపాలన కొనసాగుతోందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, నిర్వాసితుల సమస్యపై బీజేపీ పోరాటం చేస్తుందని, ఉద్యోగాల భర్తీ, రైతుల సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తోందన్నారు.
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ.. రాయలసీమ నుంచి ఎందరు సీఎంలైనా ఈ ప్రాంతం బాగుపడలేదని, ఫ్యాక్షనిజంతో రాయలసీమను అభివృద్ధికి దూరం చేశారని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే పార్టీ.. బీజేపీ అని కడప రాజకీయాల్లో 40 ఏళ్లుగా ఒకే కుటుంబం ఉందన్నారు. బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతోందని, యువత, మహిళలు రాజకీయాల్లోకి వచ్చి ఏపీని రక్షించుకోవాలని కోరారు.
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ..వివేకాను వాళ్లే చంపించి నాపై కేసులు పెట్టారన్నారు. జగన్.. చేయాల్సిన పనులు చేయరు.. చేయకూడనివి చేస్తారని మండిపడ్డారు. చంద్రబాబు.. హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి కాదు అన్నారు. కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. భూములు కబ్జాపైనే వైసీపీ నేతల కన్ను పడిందని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. రాయలసీమ అభివృద్ది కావాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలని, తమకు అధికారం ఇస్తే రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని హామీ ఇచ్చారు.