2019 ఎన్నికల్లో చావును తప్పించుకుని కన్ను లొట్టబోయినట్టు అతికష్టం మీద ముగ్గురు టీడీపీ ఎంపీలు గెలిచారని, వారు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి, చనిపోయిన పార్టీని బతికించుకోవడానికి పార్లమెంటును వినియోగించుకుంటున్నారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక, ప్రత్యేక హోదాని తన స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్రానికి తాకట్టు పెట్టింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. దాన్ని తిరిగి సాధించుకోవడం కోసం కలిసి రమ్మని టీడీపీ ఎంపీలను కోరినా, వారు కలిసి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు తేలు కుట్టిన దొంగలా దొరికిపోయి, హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి అమరావతి రాజధాని పేరుతో ప్రజలను వంచించాడని మండిపడ్డారు.
బషీర్ బాగ్ లో రైతులను కాల్చి చంపిన చంద్రబాబు, రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు జడ్జిలుగా పనికిరారని, బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా లేఖలు రాసిన చంద్రబాబు టీడీపీ ఆవిర్భావ సభలో బీసీల గురించి ఏం చర్చిస్తారు..?. అలానే ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా.. అని మాట్లాడిన చంద్రబాబు ఎస్సీల గురించి ఏం చర్చిస్తారని ప్రశ్నించారు.
ఒక సభ్యత, సంస్కారం లేకుండా టీడీపీ ఎంపీలు ముఖ్యమంత్రిగారిపై విమర్శలు చేస్తున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రామ్మోహన్ నాయుడు ఉన్నత చదువులు చదువుని కూడా, ఒక వీధి రౌడీలా, నిరక్షరాస్యుడిలా మాట్లాడుతున్నాడన్నారు. టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్ నాయుడులు స్థాయికి మించి మాట్లాడుతున్నారని, ఇకనైనా, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు చెవిల్లో పువ్వులు పెట్టుకున్నట్టు ప్రభుత్వంలో రూ. 48 వేల కోట్లు అవినీతి జరిగిందని టీడీపీ ఎంపీలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.