Site icon 123Nellore

టీడీపీ ఒక కుల పార్టీ : విజయసాయిరెడ్డి

టీడీపీ ఒక కుల పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కులాలకు అతీంగా పాలిస్తున్న ఏకైక పార్టీ వైసీపీ అని స్పష్టం చేశారు. తిరుపతిలో శనివారం నిర్వహించనున్న జాబ్ మేళా కార్యక్రమ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కనీసం ఒక్క పధకాన్నైనా ప్రజల కోసం తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలను బెదిరించడం, పీడించడం తప్ప చంద్రబాబు పాలనలో ఏమైనా మంచి జరిగిందా అని నిలదీశారు. ప్రభుత్వంపై చంద్రబాబు,  ఆ పార్టీ నేతలు నోటికొచ్చినట్లు పిచ్చి వాగుడు వాగుతున్నారని మండిపడ్డారు.

లోకేష్ ని నమ్ముకుని చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలకు వెళ్లగలడా అని ప్రశ్నించాడు. జనసేనతో పొత్తుకోసం చంద్రబాబు తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగ కల్పనలో ఏపీ ప్రభుత్వం ముందుందని, వైసీపీ నిర్వహిస్తున్న జాబ్‌మేళాలో పాల్గొనేందుకు లక్షన్నర మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. మూడేళ్లలో జగన్ 30కి పైగా సంక్షేమ పథకాలను అమలు చేసినట్టు తెలిపారు. బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూరాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

కుల మతాలకు అతీతంగా తమ ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తున్నట్టుగా వివరించారు. కరెంట్ కోతలపైనా విజయసాయి రెడ్డి స్పందించారు. కొద్ది రోజుల్లో కరెంటు సమస్య చక్కబడుతుందని, తీవ్రమైన బొగ్గు కొరత కారణంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తిస్థాయిలో నడవడం లేదని, ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ 1.4 శాతం పెరిగి దేశవ్యాప్తంగా కరెంటు కొరత ఏర్పడిందని వెల్లడించారు.త్వరలో ఏపీకి మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు.

 

 

Exit mobile version